హైదరాబాద్: ఎన్నారై పారిశ్రామికవేత్త చిగురుపాటి జయరాం హత్య కేసు విచారణలో హైదరాబాదు జూబ్లీహిల్స్ పోలీసులు వేగం పెంచారు. నందిగామ జైలులో ఉన్న నిందితులు రాకేష్ రెడ్డి, శ్రీనివాస రెడ్డిలను తీసుకుని వచ్చేందుకు పోలీసులు బృందాలు అక్కడికి బయలుదేరాయి.

వారిద్దరిని తమ కస్టడీకి ఇవ్వాలని జూబ్లీహిల్స్ పోలీసులు కోర్టును కోరే అవకాశం ఉంది. అలాగే, జయరాం అమెరికా నుంచి వచ్చిన తర్వాత ఎవరెవరికి ఫోన్లు చేశారనే విషయాన్ని కనుక్కోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఆయన ఫోన్ కాల్ డేటాను పరిశీలిస్తున్నారు. 

జయరాం కాల్ డేటాతో పాటు ఆయన మేనకోడలు శిఖా చౌదరి, రాకేష్ రెడ్డిల కాల్ డేటాను కూడా పరిశీలించనున్నారు. జయరాం హత్య కేసును నందిగామ పోలీసులు జూబ్లీహిల్స్ పోలీసులకు బదలాయించిన విషయం తెలిసిందే. 

తన భర్తను మేనకోడలు శిఖా చౌదరి చంపించిందని జయరాం భార్య పద్మశ్రీ అనుమానాలు వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో జయరాం హత్య కేసును జూబ్లీహిల్స్ పోలీసులు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు.