హైదరాబాద్ నగరంలో చికెన్ ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. గత నెలలో కేజీ చికెన్ రూ.50 కి అమ్మిన దుకాణాదారులు ప్రస్తుతం ధరలను అమాంతం పెంచేశారు. గ్రేటర్‌ పరిధిలోని హైదరాబా ద్‌, రంగారెడ్డి జిల్లాల్లో కరోనా పాజిటివ్‌ కేసులు క్రమేణా పెరుగుతున్నాయి. రాష్ట్రంలో నమోదవుతున్న కేసుల్లో జీహెచ్‌ఎంసీకి చెందినవే అధికంగా ఉన్నాయి. 

కరోనా వైరస్‌ బారి నుంచి బయట పడాలంటే శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుకోవాలని, ఈ మేరకు తగిన పోషకాహారం తీసుకోవాలని డాక్టర్లు చెబుతున్నారు. దీంతో చాలా మంది చికెన్‌ తినేందుకు ఆసక్తి చూపుతున్నారు.

కరోనా భయంతో నెల రోజుల క్రితం మెహిదీపట్నం, లంగర్‌హౌస్‌, గోల్కొండ, సన్‌సిటీ, అంబర్‌పేట్‌, సికింద్రాబాద్‌, ముషీరాబాద్‌, మాదాపూర్‌, కొండాపూర్‌ తదితర ప్రాంతాల్లో కిలో స్కిన్‌లెస్ చికెన్‌ను రూ.40 నుంచి రూ.50 వరకు విక్రయించారు. 

స్కిన్‌తో కలిపి కిలో చికెన్‌ను రూ.30కి ఇచ్చారు. కొన్ని ప్రాంతాల్లో కోళ్ల నిర్వహణ భారంతో వినియోగదారులకు ఉచితంగానే ఇచ్చారు. ఒక్కో గుడ్డు ధర రూ.3లే పలికింది. అయితే.. చికెన్‌, గుడ్డు తినడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుందని రాష్ట్ర ప్రభుత్వం చెప్పడంతో ధరలు పెరిగాయి.

నగరంలోని పలు ప్రాంతాల్లో 15 రోజుల క్రితం కిలో చికెన్‌ ధర రూ.120 ఉండగా, ప్రస్తుతం రూ.80 అదనంగా పెరిగింది. దీంతో చాలా ఏరియాల్లో కిలోకు రూ.200 రూ. 220లకు అమ్ముతుండటం గమనార్హం.