వేములవాడ టీఆర్ఎస్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ పౌరసత్వంపై తెలంగాణ హైకోర్టులో సోమవారం విచారణ జరిగింది. ఈ సందర్భంగా రమేశ్ జర్మనీ పౌరసత్వాన్ని కలిగి ఉన్నట్లు కేంద్ర హోంశాఖ కోర్టు దృష్టికి తీసుకొచ్చింది. జర్మనీ పాస్‌పోర్ట్‌తో మద్రాస్ నుంచి జర్మనీ వెళ్లారని తెలిపింది.

దీంతో భారత పౌరసత్వం ఉండగా జర్మనీ పాస్‌పోర్టుతో ఎందుకు వెళ్లారని హైకోర్టు రమేశ్‌ను ప్రశ్నించింది. అయితే తన జర్మనీ పౌరసత్వాన్ని ఎప్పుడో రద్దు చేసుకున్నట్లు చెన్నమనేని న్యాయస్థానానికి తెలిపారు.

Also Read:నా పౌరసత్వంపై పిచ్చిపిచ్చి కూతలు కూస్తున్న వారికి....: టీఆర్ఎస్ ఎమ్మెల్యే చెన్నమనేని ఫైర్

ఈ నేపథ్యంలో జర్మనీ పౌరసత్వం రద్దు చేసుకున్నట్లు పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని చెన్నమనేని రమేశ్‌ను హైకోర్టు ఆదేశించింది. అదే సమయంలో కేంద్ర హోంశాఖ రద్దు చేసిన ఉత్తర్వుపై స్టే కొనసాగిస్తున్నట్లు తెలిపి, తదుపరి విచారణను ఈ నెల 24కి వాయిదా వేస్తున్నట్లు వెల్లడించింది. 

టీఆర్ఎస్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ కు భారత పౌరసత్వం లేదని  విదేశీ పౌరసత్వం ఉందని ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికైనా చెల్లదని శ్రీనివాస్  హైకోర్టును ఆశ్రయించారు.  

Also Read:టీఆర్ఎస్ ఎమ్మెల్యే చెన్నమనేనికి హోంశాఖ షాక్, భారత పౌరసత్వం రద్దు: అనర్హత వేటేనా..?

టీఆర్ఎస్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ పౌరసత్వం వివాదంపై మూడు నెలల్లోపు తేల్చాలని కేంద్ర హోంశాఖను గతేడాది జూలై 10వ తేదీన హైకోర్టు ఆదేశించింది  చెన్నమనేని రమేష్ పౌరసత్వం వివాదంపై ఆయన ప్రత్యర్ధి శ్రీనివాస్ దాఖలు చేసిన పిటిషన్‌పై గతేడాది నవంబర్ 22న హైకోర్టు విచారణ జరిపింది.

ఈ సందర్భంగా భారత పౌరసత్వాన్ని రద్దు చేస్తూ కేంద్ర హోంమంత్రిత్వశాఖ తీసుకొన్న నిర్ణయంపై  తెలంగాణ హైకోర్టు స్టే విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది.