వరంగల్: భూపాలపల్లి  మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి తనను లైంగికంగా వేధింపులకు గురిచేశాడని  విజయలక్ష్మిరెడ్డి అనే  మహిళ ఆరోపించింది. హన్మకొండలోని జీఎంఆర్ అపార్ట్‌మెంట్ వద్ద ఆదివారం సాయంత్రం  ధర్నాకు దిగింది. గండ్ర వెంకటరమణారెడ్డిపై నిర్భయ కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని ఆమె డిమాండ్ చేసింది. 

కాంగ్రెస్ నేత భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డిపై విజయలక్ష్మిరెడ్డి అనే మహిళ  చేసిన లైంగిక  ఆరోపణలు  ఎదుర్కొంటున్నారు. బాధితురాలు  తనకు న్యాయం చేయాలని గండ్ర వెంకటరమణారెడ్డి నివాసం ఉంటున్న  హన్మకొండ జీఎంఆర్ అపార్ట్‌మెంట్  వద్ద  ఆందోళనకు దిగింది.

స్వచ్ఛంధ సంస్థ ద్వారా  తాను  సామాజిక కార్యక్రమాలను చేస్తున్న క్రమంలోనే గండ్ర వెంకట రమణారెడ్డితో తనకు పరిచయం ఏర్పడిందన్నారు.  ఈ పరిచయం  తమ మధ్య వివాహేతర సంబంధానికి దారితీసిందని ఆమె  చెబుతోంది.  ఐదేళ్లుగా  తనను శారీరకంగా ఉపయోగించుకొన్నాడని  ఆమె ఆరోపిస్తోంది.  నాలుగు రోజుల క్రితం వరకు  కూడ తనతో వివాహేతర సంబంధాన్ని కలిగి ఉన్నాడని ఆమె ఆరోపించింది.

ఈ నెల 3వ తేదీ రాత్రి ఆయనను కలిసేందుకు జీఎంఆర్ అపార్ట్‌మెంట్‌కు వెళ్తే  పోలీసులకు చెప్పి తనను అరెస్ట్ చేయించారని బాధితురాలు ఆరోపించింది. అయితే  తనకు న్యాయం చేయాలని బాధితురాలు ఆదివారం నాడు జీఎంఆర్ అపార్ట్‌మెంట్ ఎదుట ధర్నాకు దిగింది.  విజయలక్ష్మిని పోలీసులు  సుబేదారి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.  బాధితురాలి ఫిర్యాదు మేరకు గండ్ర వెంకటరమణారెడ్డిపై కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.

తనను రాజకీయంగా ఎదుర్కొలేకనే అధికార పార్టీకి చెందిన తనపై తప్పుడు ఆరోపణలు చేయిస్తున్నారని గండ్ర వెంకటరమణారెడ్డి చెప్పారు.  అధికార పార్టీకి చెందిన నేతలు విజయలక్ష్మికి  మద్దతు తెలుపుతూ  తనపై నీచపు ఆరోపణలు చేయిస్తున్నారని గండ్ర వెంకటరమణారెడ్డి ఆరోపించారు.