Asianet News TeluguAsianet News Telugu

70యేళ్ల డాక్టర్ కొంపముంచిన డేటింగ్ యాప్.. రూ.70 లక్షలకు టోపీ..

డేటింగ్ యాప్ ల వలలో చిక్కుకుని అమ్మాయిలతో చాటింగ్ కోసం అరవై యేళ్ల వైద్యుడు రూ.70 లక్షల దాకా సమర్పించుకున్నాడు. తీరు మార్చుకోకుండా డేటింగ్ యాప్ లలో చాటింగ్ చేస్తుండడంతో కుటుంబ సభ్యులు అతని ఖాతాలు స్తంభింపజేశారు. ముషీరాబాద్ లో భార్యబిడ్డలతో కలిసి ఉంటున్న డాక్టర్ రమేష్ గుజరాత్ లో వైద్యం చేస్తుంటాడు. నెలలో కొంతకాలం గుజరాత్ లో, మిగతా రోజులు హైదరాబాద్ లో ఉంటాడు.

Chatting with young women, Doctor who lost up to Rs 70 lakh in hyderabad - bsb
Author
Hyderabad, First Published Mar 18, 2021, 9:24 AM IST

డేటింగ్ యాప్ ల వలలో చిక్కుకుని అమ్మాయిలతో చాటింగ్ కోసం అరవై యేళ్ల వైద్యుడు రూ.70 లక్షల దాకా సమర్పించుకున్నాడు. తీరు మార్చుకోకుండా డేటింగ్ యాప్ లలో చాటింగ్ చేస్తుండడంతో కుటుంబ సభ్యులు అతని ఖాతాలు స్తంభింపజేశారు. ముషీరాబాద్ లో భార్యబిడ్డలతో కలిసి ఉంటున్న డాక్టర్ రమేష్ గుజరాత్ లో వైద్యం చేస్తుంటాడు. నెలలో కొంతకాలం గుజరాత్ లో, మిగతా రోజులు హైదరాబాద్ లో ఉంటాడు.

ఆరు నెలల క్రితం ఓ డేటింగ్ యాప్ లో పరిచయమైన యువతితో కొంతకాలం వాట్సాప్ లో చాటింగ్ చేశాడు. తర్వాత ఇద్దరూ స్నేహితులయ్యారు. ఓ రోజు ఆ అమ్మాయి ఈ వైద్యుడిని ప్రేమిస్తున్నానంటూ వల విసిరింది. ఇద్దరు కలిసి న్యూడ్ వీడియో కాల్స్ చేసుకున్నారు. ఈ భాగోతాన్ని ఆ మాయలేడీ రికార్డ్ చేసింది. 

కోరినంత డబ్బులివ్వకపోతే వీడియోను సామాజిక మాధ్యమాల్లో పెడతానని బెదిరించింది. దీంతో ఆ వైద్యుడు 2020 నవంబర్ నెలలో దఫదఫాలుగా ఆమెకు రూ.39లక్షల వరకు సమర్పించుకున్నాడు. అయినప్పటికీ తీరు మార్చుకోకుండా డేటింగ్ యాప్ లలో ఇతర అమ్మాయిలతో చాటింగ్ చేస్తున్నట్టుగా కుటుంబ సభ్యులు గుర్తించారు. వెంటనే సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. గత నెల రోజుల్లో మరో రూ.30 లక్షలు ముట్టజెప్పాడని పోలీసులకు వివరించారు.

ఎందుకు అనవసరంగా డబ్బులు గతలబెడుతున్నారని భార్యబిడ్డలు ప్రశ్నిస్తే.. నా డబ్బులు నా ఇష్టం... నాకు నచ్చినట్లు ఉంటా.. నచ్చినట్లు ఖర్చు చేస్తా... అంటూ ఎదురుదాడికి దిగుతున్నాడని సైబర్ ఏసీపీ కె.వి.ఎం.ప్రసాద్, ఇన్ స్పెక్టర్ ప్రశాంత్ ల వద్ద వాపోతూ ఫిర్యాదు చేశారు. 

అతని బ్యాంకు ఖాతాలను స్తంభింప చేయించాలని కోరారు. దీంతో పోలీసులు ఆ వైద్యుడి ఖాతాను స్తంభింపచేయించారు. అయితే ఇప్పుడా ఖాతాను తెరిపించాలంటూ పోలీసులను  ఆ వైద్యుడు కోరుతున్నాడు. కుటుంబ సభ్యుల కోరిక మేరకు ఏసీపీ  కె.వి.ఎం.ప్రసాద్ ఆ వైద్యుడితో మాట్లాడారు.

ఇక మీదట గుర్తు తెలియని వారికి డబ్బులు పంపనని రాత పూర్వక హామీ ఇస్తేనే ఖాతాను తెరిపిస్తాం.. అని తెలిపారు. కాగా, నవంబర్ లో రూ. 39 లక్షలు పోగొట్టుకున్న తరువాత సార్.. నా డబ్బులు దొరుకుతాయా.. నిందితులను పట్టుకున్నారా? అంటూ రోజూ సైబర్ పోలీసులను అడుగుతుండడం కొసమెరుపు. 

Follow Us:
Download App:
  • android
  • ios