2019లో తెలంగాణ టిడిపిదే : చంద్రబాబు

Chandrababu to tour in Telangana after four years to revive party
Highlights

  • పొత్తులపై మాట్లాడొద్దని బాబు ఆదేశం
  • విలీనం ముచ్చటే లేదని పునరుద్ఘాటన
  • ఏప్రిలో తెలంగాణ జిల్లాల పర్యటనకు బాబు అంగీకారం

 

 ‘‘తెలంగాణలో మన బలమేం తగ్గలేదు. లీడర్లు పోతే పోవచ్చు కానీ.. పటిష్టమైన కార్యకర్తల బలం మనకు అలాగే ఉన్నది. కేడర్ ను తట్టిలేపి కలిసికట్టుగా పనిచేయండి. 2019లో తెలంగాణలో టిడిపిదే హవా. మన సపోర్ట లేకుండా ప్రభుత్వం ఏర్పాటయ్యే చాన్సే లేదు. మీ పరిధిలో మీరు చేయండి. నా పరిధిలో నేను తెలంగాణలో పార్టీని బలోపేతం చేయడం కోసం ఎంత చేయాలో అంతా చేస్తాను.’’

తెలంగాణ టిడిపి నేతలతో గురువారం ఉదయం పార్టీ అధినేత చంద్రబాబు హైదరాబాద్ లోని తన నివాసంలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా బాబు పైవిధంగా కామెంట్స్ చేశారని పార్టీ నేతలు అంటున్నారు. పొత్తులపై పదే పదే మాట్లాడుతూ కార్యకర్తలను గందరగోళంలోకి నెట్టొద్దని బాబు మరోసారి తెలంగాణ నేతలకు స్పష్టం చేశారు. ఏప్రిల్ లో ఖమ్మం నుంచి తెలంగాణ అన్న జిల్లాల్లో యాత్ర చేపట్టేందుకు బాబు అంగీకరించారు. పార్టీ నేతలు ప్లాన్ చేసుకోవాలని సూచించారు.

ఎపి రాజకీయాల్లో ఉన్న పరిస్థితులను చూచాయగా తెలంగాణ నేతలకు బాబు వివరించారు. ఎపిలో అధికారాన్ని నిలబెట్టుకోవడంతోపాటు తెలంగాణలో పూర్వ వైభవం సాధించేందుకు కలిసికట్టుగా ముందుకు సాగుదామని ప్రకటించారు. ఎన్నికల సమయంలో పొత్తులపై చర్చలు చేద్దామని స్పష్టం చేశారు. పార్టీని విలీనం చేయాలన్న వాదనలో పస లేదని తేల్చి పారేశారు. కార్యకర్తలను సన్నద్ధం చేసి ఎన్నికల నాటికి బలమైన శక్తిగా నిలిపేందుకు పార్టీ నేతలు పనిచేయాలన్నారు. కాంగ్రెస్, బిజెపి, టిఆర్ఎస్ పార్టీల విషయంలో నిన్న జరిగిన సమావేశంలో ఇప్పటికే బాబు క్లారిటీ ఇచ్చినందున ఇవాళ కూడా ఆయా పార్టీలపై చర్చ జరిగినట్లు తెలిసింది. కాంగ్రెస్, బిజెపి లు మనకు దూరం జరిగిపోయినట్లేనన్న చర్చ పార్టీ సమావేశంలో జరిగినట్లు చెబుతున్నారు.

మొత్తానికి తెలంగాణలో ఇప్పుడున్న పరిస్థితుల్లో 2019 ఎన్నికల తర్వాత టిడిపి మీద ఆధారపడే ప్రభుత్వమే ఉంటుందని బాబు తెలంగాణ తమ్ముళ్లకు తేటతెల్లంగా చెప్పినట్లు పార్టీ వర్గాలు అంటున్నాయి.

loader