ఎల్వీ ప్రసాద్ హాస్పిటల్ కు చంద్రబాబు... కాసేపట్లో కంటి ఆపరేషన్
ఆంధ్ర ప్రదేశ్ మాజీ సీఎం, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడికి మరికాసేపట్లో కంటి ఆపరేషన్ జరగనుంది.
హైదరాబాద్ : అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు చికిత్సకోసం హైదరాబాద్ లో వుంటున్న విషయం తెలిసిందే. ఇప్పటికే గచ్చిబౌలిలోని ఏఐజి హాస్పిటల్లో చికిత్స పొందుతున్న చంద్రబాబు కంటి ఆపరేషన్ కోసం నేడు ఎల్వీ ప్రసాద్ హాస్పిటల్ కు వెళ్లారు. కొద్దిసేపటి క్రితమే ఎల్వీ ప్రసాద్ హాస్పిటల్ కు చంద్రబాబు చేరుకున్నారు.
కంటి సమస్యతో బాధపడుతున్న చంద్రబాబుకు క్యాటరాక్ట్ ఆపరేషన్ చేయనున్నారు. ఇందుకోసం హాస్పిటల్ సిబ్బంది అన్ని ఏర్పాట్లు చేసారు. కాసేపట్లో డాక్టర్లు చంద్రబాబుకు ఆపరేషన్ చేయనున్నారు. చంద్రబాబు వెంట భువనేశ్వరి కూడా హాస్పిటల్ కు వెళ్లారు.
చాలారోజులు రాజమండ్రి సెంట్రల్ జైల్లో వున్న చంద్రబాబు వివిధ ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. దీంతో బెయిల్ పై జైలునుండి విడుదల కాగానే హైదరాబాద్ కు చేరుకున్న ఆయన ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ (ఏఐజి) చికిత్స పొందుతున్నారు. ఇప్పటికే రెండుసార్లు హాస్పిటల్ కు వెళ్లి వైద్య పరీక్షలు చేయించుకున్నారు. అనారోగ్యంతో పాటు చర్మ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయనకు డాక్టర్లు మెరుగైన వైద్యం అందిస్తున్నారు.
ఏఐజి హాస్పిటల్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ నిపుణులు డాక్టర్ కే రాజేష్ ఆధ్వర్యంలో చంద్రబాబుకు చికిత్స పొందుతున్నారు. జనరల్ మెడిసిన్ తో పాటు కార్డియాలజీ, పల్మనాలజీ, డెర్మటాలజీ విభాగాలకు చెందిన డాక్టర్ల బృందం చంద్రబాబుకు వివిధ పరీక్షలు సూచించారు. కాలేయ, మూత్రపిండాల పనితీరు, రక్త, మూత్ర పరీక్షలు, 2డీ ఎకో, ఈసీజీ, అలర్జీ స్క్రీనింగ్ లాంటి టెస్టులు చేసినట్లుగా సమాచారం.
ఇక స్కిల్ డెవలప్ మెంట్ కేసులో అరెస్టయి దాదాపు 53 రోజులు రాజమండ్రి సెంట్రల్ జైల్లో వున్నారు చంద్రబాబు. అయితే చాలాకాలం జైల్లో వుండటంతో ఆయన అనారోగ్యం బారినపడటంతో ఏపీ హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. కేవలం వైద్యం కోసమే బెయిల్ మంజూరు చేసినట్లు... కేసును ప్రభావితం చేసేలా వ్యవహరించకూడదని న్యాయస్థానం షరతులు విధించింది. దీంతో రాజకీయాలకు దూరంగా వుంటున్న చంద్రబాబు హైదరాబాద్ నివాసానికే పరిమితం అయ్యారు. కేవలం హాస్పిటల్ కు వెళ్ళడానికి ఆయన ఇంటినుండి బయటకు వస్తున్నారు.