Asianet News TeluguAsianet News Telugu

కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్కను పరామర్శించిన చంద్రబాబు

ములుగు కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క మాతృమూర్తి సమ్మక్కను టిడిపి జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు పరామర్శించారు. 

Chandrababu Consulted congress mla seethakka akp
Author
Hyderabad, First Published Jun 7, 2021, 2:55 PM IST

హైదరాబాద్ లోని ఏఐజి హాస్పిటల్లో చికిత్స పొందుతున్న ములుగు కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క మాతృమూర్తి సమ్మక్కను టిడిపి జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు పరామర్శించారు. సమ్మక్క ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్న చంద్రబాబు ఆమెకు ధైర్యం చెప్పారు. ఆ తర్వాత సీతక్కకు కూడా ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా సీతక్క క్రమశిక్షణ,సేవాగుణం గురించి అక్కడే వున్న డాక్టర్లతో గొప్పగా చెప్పారు చంద్రబాబు. 

తన తల్లిని చంద్రబాబు పరామర్శించడానికి వచ్చిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ సీతక్క భావోద్వేగానికి గురయ్యారు. '' ప్రాణాలతో పోరాడుతూ వెంటిలేటర్ పై చికిత్స పొందిన మా అమ్మ ఆరోగ్యం కాస్త మెరుగుపడింది. దీంతో ఆమెకు వెంటిలేటర్ తొలగించి  చికిత్స అందిస్తున్నారు. ఇలాంటి మంచి వార్త తెలిసిన సమయంలో అన్న(చంద్రబాబు) తమను పరామర్శించడానికి రావడం మరింత ధైర్యాన్ని ఇచ్చింది. అమ్మ ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్న ఆయన ఎంతో  ధైర్యాన్నిచ్చేలా మాట్లాడారు'' అంటూ సీతక్క ట్వీట్ చేశారు. 

వీడియో

 

ఇదిలావుంటే కరోనా వ్యాప్తి, లాక్ డౌన్ సమయంలో నిరుపేదలు, గిరిజనుల కష్టాలను దూరంచేయడానికి ప్రయత్నిస్తున్న ములుగు ఎమ్మెల్యే సీతక్కకు కూడా పోలీసుల నుండి కష్టాలు తప్పలేదు. తన తల్లి చావుబ్రతుకులతో పోరాడుతూ ఐసియూలో చికిత్స పొందుతుంటే మల్కాజిగిరి డిసిపి రక్షిత కనీస మానవత్వాన్ని కూడా చూపకుండా దురుసుగా ప్రవర్తించారంటూ సీతక్క ఆవేదన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. బ్లడ్ డొనేట్ చేయడానికి పర్మిషన్ తో వెలుతున్న తమ కుటుంబ సభ్యులను అడ్డుకున్నారని సీతక్క తెలిపారు. 

మా అమ్మ పరిస్థితి సీరియస్ గా వుంది... దయచేసి వారిని పంపించండి అని స్వయంగా తానే వీడియో కాల్ ద్వారా కోరినా డిసిపి పట్టించుకోలేదని... తమవారిని అడ్డుకొని దురుసుగా మాట్లాడుతూ అర్ధగంట సేపు పక్కకు నిలబెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక సేవకురాలు, ఎమ్మెల్యే అయిన తనకే ఈ విధంగా ఇబ్బందులు ఎదురైతే  సాధారణ ప్రజల పరిస్థితి ఏంటి ఒక్కసారి ఆలోచించండి... అని సీతక్క డిసిపి తీరును తప్పుబట్టారు. అయితే పోలీస్ ఉన్నతాధికారులు మాత్రం డిసిపి రక్షితకు మద్దతుగా నిలిచారు.  

Follow Us:
Download App:
  • android
  • ios