తెలుగు రాష్ట్రాలలో మిర్చి రైతుల గోడుకు ఇక్కడి ముఖ్యమంత్రులు స్పందించకపోయినా కేంద్రం కరుణించింది. 

గిట్టుబాటు ధర లేక మండిపోతున్న మిర్చి రైతుకు కేంద్రం కాస్త ఊరటనిచ్చే వార్త చెప్పింది.

గత కొన్నిరోజులుగా తెలుగురాష్ట్రాలలో మిర్చి రైతులు మద్దతు ధర కోసం నిరసనలు, ధర్నాలు చేస్తున్న విషయం తెలిసిందే.

ఈ విషయంలో ఇరు రాష్ట్రాల సీఎంలు రైతులకు మద్దతు ధర ప్రకటించే విషయంపై పెద్దగా స్పందించలేదు. అయితే కేంద్రం మాత్రం ఈ విషయంపై కాస్త స్పందించింది

తెలుగు రాష్ట్రాల్లో మిర్చి రైతుల‌ను ఆదుకోవాల‌ని మంత్రి వెంక‌య్య‌నాయుడు కేంద్ర వ్య‌వ‌సాయశాఖ మంత్రి రాధామోహ‌న్ సింగ్‌ను కోరడంతో ఆయన దీనిపై సానుకూలంగా స్పందించారు.

మిర్చి రైతుల నుంచి మార్కెట్ ఇంటర్వెన్ష‌న్ స్కీమ్ ద్వారా మిర్చి కొనేందుకు తాము సిద్ధం అని ఆయన ప్రకటంచారు. మే 2 నుంచి మే 31 వ‌ర‌కు కొనుగోళ్లు చేస్తామ‌ని రాధామోహ‌న్ సింగ్ చెప్పారు. రాష్ట్ర ప్ర‌భుత్వ ఏజెన్సీల ద్వారానే మిర్చి కొనుగోలు ఉంటుంద‌న్నారు.

క్వింటాకు రూ. 5 వేల మద్దతు ధర ఇస్తామని అదనపు ఖర్చుల కోసం మరో రూ. 1500 చెల్లిస్తామని వెల్లడించారు.

ఏజెన్సీల ద్వారా కొనుగోలు చేసిన మిర్చికి నష్టం వాటిల్లితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 50 50 శాతం భరించాలని తెలిపారు.