తెలంగాణ నుంచి ధాన్యం కొనుగోలుకు నిరాకరిస్తున్న కేంద్రం : మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
Hyderabad: తెలంగాణ నుంచి ధాన్యం కొనుగోలుకు కేంద్రం నిరాకరిస్తోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆరోపించారు. దేశంలో పండించాల్సిన పంటలపై కేంద్రం వద్ద శాస్త్రీయ అంచనాలు లేవని విమర్శించారు.

Agriculture Minister Singireddy Niranjan Reddy: తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మరోసారి కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. దేశంలో వరి ధాన్యం కొరత ఉన్నా తెలంగాణ నుంచి ధాన్యం కొనుగోలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నిరాకరిస్తోందని ఆరోపించారు. దేశంలో పండించాల్సిన పంటలపై కేంద్రం వద్ద శాస్త్రీయ అంచనాలు లేవని విమర్శించారు.
"ప్రస్తుతం దేశంలో బియ్యం లేవని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. యాసంగిలో 56.44 లక్షల ఎకరాల్లో వరి పంటను సాగు చేస్తున్నారు. ఇదే సమయంలో కేంద్రం మా నుంచి వరి ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి నిరాకరిస్తోంది" అని ఆయన అన్నారు. శనివారం కిసాన్ మేళాలో పాల్గొన్న సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడిసినల్ అండ్ ఆరోమాటిక్ ప్లాంట్స్ (సీఐఎంఏపీ)లో కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (సీఎస్ఐఆర్) కిసాన్ మేళాను నిర్వహించింది. సాగు చేయాల్సిన పంటలపై కేంద్రం వద్ద శాస్త్రీయ అంచనాలు లేవని మంత్రి ఆరోపించారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో సాగు చేస్తున్న పంటలను అంచనా వేయాలనీ, ఈ సంఖ్యల ఆధారంగా అవసరమైన పంటల ఎదుగుదలకు వెసులుబాటు కల్పించాలని సింగిరెడ్డి సూచించారు.
అంతర్జాతీయ మార్కెట్లో ఔషధ మొక్కలకు విపరీతమైన డిమాండ్ ఉందని వ్యవసాయ మంత్రి తెలిపారు. ఔషధ మొక్కల పెంపకాన్ని ప్రోత్సహించాలని, ఔషధ మొక్కలు లేకుంటే ప్రపంచంలో 800 కోట్ల మందికి మందులు ఉండవని అన్నారు. రసాయన పదార్థాలతో తయారు చేసిన కాస్మోటిక్ ఉత్పత్తులు ఆరోగ్యానికి హానికరమని, సహజసిద్ధమైన ఔషధ మొక్కలు అధిక జీవన ప్రమాణాలను ఇస్తాయని సింగిరెడ్డి అన్నారు. సహజ ఉత్పత్తులకు సమాజంలో ఆదరణ పెరుగుతోందని తెలిపారు. ఔషధ మొక్కల ప్రపంచ మార్కెట్లో చైనాదే ఆధిపత్యం ఉంది.. డిమాండ్ ఉన్న పంటలను పండించేలా రైతులను కేంద్రం ప్రోత్సహించాలన్నారు.