Hanumakonda: రాజకీయ లబ్ది కోసం దేవాలయాలను వాడుకునే బీజేపీ వాటి అభివృద్ధిపై దృష్టి పెట్టడం లేదని ప్రభుత్వ చీఫ్‌విప్‌ దాస్యం వినయ్‌భాస్కర్ అన్నారు. ఆదివారం హ‌న్మ‌కొండ‌లోని వేయిస్తంభాల గుడిలో మీడియాతో మాట్లాడుతూ ఆయ‌న ఈ వ్యాఖ్య‌లు చేశారు. 

Thousand Pillars Temple-Chief Whip D Vinay Bhaskar: కాకతీయుల ఘనమైన వారసత్వ సంపదను పరిరక్షించేందుకు బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం నిర్ల‌క్ష్యంగా ఉంద‌ని ప్ర‌భుత్వ‌ చీఫ్ విప్ డి.వినయ్ భాస్కర్ అన్నారు. రాజకీయ లబ్ది కోసం దేవాలయాలను వాడుకునే బీజేపీ వాటి అభివృద్ధిపై దృష్టి పెట్టడం లేదని ప్రభుత్వ చీఫ్‌విప్‌ దాస్యం వినయ్‌భాస్కర్ అన్నారు. ఆదివారం హ‌న్మ‌కొండ‌లోని వేయిస్తంభాల గుడిలో మీడియాతో మాట్లాడుతూ ఆయ‌న ఈ వ్యాఖ్య‌లు చేశారు.

వివ‌రాల్లోకెళ్తే.. ప్రభుత్వ చీఫ్‌విప్‌ దాస్యం వినయ్‌భాస్కర్ హ‌న్మ‌కొండ‌లోని వేయి స్తంభాల గుడిని సంద‌ర్శించారు. ఈ క్ర‌మంలోనే జ‌రుగుతున్న ప‌నుల‌ను ప‌రిశీలించారు. వేయిస్తంభాల గుడిలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాజకీయ లబ్ది కోసం దేవాలయాలను వాడుకునే బీజేపీ వాటి అభివృద్ధిపై దృష్టి సారించడం లేదని విమ‌ర్శించారు. కళ్యాణ‌ మండపం పునరుద్ధరణ పనులు ప్రారంభించి 17 ఏళ్లు అవుతోంది. అయితే కేంద్ర పర్యాటక, సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేసే కేంద్ర ప్రభుత్వ సంస్థ ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ) నుంచి నిధులు లేకపోవడంతో పనులు నత్తనడకన సాగుతున్నాయని వినయ్‌భాస్కర్ తెలిపారు.

132 స్తంభాలతో కూడిన కళ్యాణ మండపాన్ని పునరుద్ధరించేందుకు కేంద్రం 2005లో ఆమోదం తెలపగా, 2006లో పనులు ప్రారంభమయ్యాయి. కేంద్రం 2006లో రూ.3.5 కోట్లు విడుదల చేయగా 2009 నాటికి పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. తీవ్ర జాప్యం కారణంగా పనుల అంచనా రూ.7.50 కోట్లకు పెరిగింది. స్టాపతి (ఆర్కిటెక్ట్) తనకు చెల్లింపులో జాప్యం కారణంగా పనులను మధ్యలోనే వదిలేశాడు. తాజా అంచనా ప్రకారం పనులు పూర్తి చేయడానికి ఏఎస్ఐకి మరో రూ.6 కోట్లు అవసరమని వినయ్ తెలిపారు. గతంలో రాష్ట్ర ప్రభుత్వం ఆలయ ప్రధాన ద్వారం ముందు ప్రాంతాన్ని రూ.20 కోట్లతో అభివృద్ధి చేయడంతో పాటు సందర్శకులకు సౌకర్యాలు కల్పించిందన్నారు. పర్యాటకులు, భక్తుల తాకిడి పెరుగుతున్నా ఏఎస్ఐ పనులు పూర్తి చేయడంలో కేంద్రం విఫలమైందన్నారు.

"బీజేపీ నేత కిషన్ రెడ్డి పర్యాటక శాఖ మంత్రి అయ్యాక వేయిస్తంభాల గుడిపై దృష్టి సారించి పనులను త్వరితగతిన పూర్తి చేస్తారని అందరం సంతోషించాం. 2022 ఆగస్టులో ఆలయాన్ని సందర్శించిన కిషన్ రెడ్డి ఈ ఏడాది చివరి నాటికి పనులు పూర్తవుతాయని స్పష్టం చేశారు. అయినా పనుల్లో ఎలాంటి పురోగతి లేదు" అని వినయ్ పేర్కొన్నారు. వివాదాల కోసం ఆలయాల గురించి మాట్లాడే బీజేపీ స‌ర్కారుకు ప్రాచీన ఆలయం కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. ఆలయ పర్యవేక్షణ అంతా కేంద్ర పురావస్తు శాఖ పరిధిలోనే ఉంద‌న్నారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి పనులు చేసేందుకు అనుమతి లేదన్నారు. ఈ కార్యక్రమంలో వేయి స్తంభాల ఆలయ ప్రధాన అర్చకుడు గంగు ఉపేంద్రశర్మ, కాకతీయ అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ చైర్మన్ సుందర్ రాజ్ యాదవ్, కార్పొరేటర్ వేముల శ్రీనివాస్, కుడా ప్రాజెక్టు అధికారి ఇ.అజిత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.