హైదరాబాద్: కిడ్నాప్‌కు గురైన  పసిపాపకు పచ్చకామెర్లు వచ్చాయి.  మెరుగైన వైద్యం కోసం చిన్నారిని  నీలోఫర్‌ ఆసుపత్రికి  తరలిస్తామని  కోఠి ప్రభుత్వాసుపత్రి ఆర్ఎంఓ జయలక్ష్మి ప్రకటించారు.బీదర్‌ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న పాపను పోలీసులు తల్లి ఒడికి చేర్చడంలో  సీసీటీవి పుటేజీ ఉపయోగపడింది.

రెండు రోజుల క్రితం  కోఠి ప్రభుత్వాసుపత్రి నుండి కిడ్నాపైన చిన్నారిని మంగళవారం సాయంత్రం బీదర్‌ ప్రభుత్వాసుపత్రిలో గుర్తించారు. అయితే కిడ్నాపర్‌ మాత్రం ఇంతవరకు దొరకలేదు.

బీదర్‌ నుండి  హైద్రాబాద్‌‌కు  ప్రత్యేక అంబులెన్స్‌లో చిన్నారిని  తీసుకొచ్చారు. ఎట్టకేలకు చిన్నారి తల్లి చెంతకు చేరుకొంది.  అయితే  చిన్నారికి పచ్చకామెర్లు వచ్చినట్టుగా అధికారులు చెబుతున్నారు. మెరుగైన వైద్యం కోసం  నీలోఫర్ ఆసుపత్రికి తరలించనున్నట్టు  ఆర్ఎంఓ జయలక్ష్మి ప్రకటించారు.

 మంగళవారం అర్ధరాత్రి 12.30 గంటల ప్రాంతంలో బీదర్ ప్రభుత్వ ఆసుపత్రి నుంచి ఆంబులెన్స్ లో బయలుదేరిన ఏసీపీ బృందం ఉదయం 3.30 గంటల ప్రాంతంలో హైదరాబాద్ ఆసుపత్రికి చేరుకొని పాపను తల్లి ఒడికి చేర్చారు.

ఇదిలా ఉంటే చిన్నారిని కిడ్నాప్ చేసిన మహిళ ఎవరనే విషయమై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఒక్క రోజు వ్యవధిలోనే  చిన్నారిని తల్లి ఒడికి చేర్చారు. అయితే ఈ కేసును చేధించేందుకు సీసీ పుటేజీని పనిచేసింది. ఎంజీబీఎస్ లో బీదర్ వెళ్లే బస్సును  కిడ్నాపర్  ఎక్కిన విషయాన్ని పోలీసులు గుర్తించారు. సుమారు 200 సీసీ కెమెరాల పుటేజీని పరిశీలించిన తర్వాత ఎంజీబీఎస్ పుటేజీ లభ్యమైంది.

ఈ పుటేజీ ఆధారంగా బీదర్‌లో దర్యాప్తు చేసిన పోలీసులకు చిన్నారి ఆచూకీ లభ్యమైంది.  అయితే కిడ్నాపర్ ఎవరనే విషయమై ఇంకా అంతుబట్టడం లేదు.  ఈ విషయమై పోలీసులు  ఆరా తీస్తున్నారు.