కరోనాకు టీకా సిద్ధమవుతున్న తరుణంలో బ్రిటన్, దక్షిణాఫ్రికాల్లో వైరస్ కొత్తరూపును సంతరించుకుంటోందంటూ వస్తున్న వార్తల నేపథ్యంలో సీసీఎంబీ శాస్త్రవేత్తలు.. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుని కలిశారు.

గురువారం సీసీఎంబీ డైరెక్టర్ డాక్టర్ రాకేశ్ మిశ్రా, సీనియర్ సైంటిస్ట్ డాక్టర్ కె.లక్ష్మీ రావ్ ఉపరాష్ట్రపతిని కలిసిన సందర్భంగా, బ్రిటన్‌, దక్షిణాఫ్రికాల్లో కరోనా వైరస్ కొత్త రూపు గురించిన వివరాలతో పాటు, భారతదేశంలో వైరస్‌ తీవ్రతలో హెచ్చుతగ్గులు, తీసుకుంటున్న చర్యలు, పరీక్షల సంఖ్యను పెంచేందుకు దేశవ్యాప్తంగా వివిధ సంస్థలతో కలిసి చేపట్టిన కార్యక్రమాలు, కరోనా టీకా ప్రభావం తదితర అంశాలను ఉపరాష్ట్రపతికి వెల్లడించారు. 

బ్రిటన్, దక్షిణాఫ్రికా దేశాల్లో వైరస్ కొత్త రూపు ప్రభావం భారత్‌పై ఎలా ఉంటుందన్న ఉపరాష్ట్రపతి ప్రశ్నకు సీసీఎంబీ డైరెక్టర్ సమాధానమిస్తూ, ఈ కొత్త రూపుపై మనం ఆందోళన చెందాల్సిన పనిలేదని, దీన్ని అడ్డుకునేందుకు ఇప్పటికే రూపుదిద్దుకుంటున్న టీకా ప్రభావం సరిపోతుందన్నారు.

కొత్త రూపు కారణంగా చాలా తక్కువ మంది ప్రభావితం అవుతున్నారన్నారు. ప్రస్తుతం భారతదేశంలో తీసుకుంటున్న జాగ్రత్త చర్యలను ఇలాగే కొనసాగించడం ద్వారా కరోనా వైరస్ కొత్త రూపు తీవ్రతను అడ్డుకోవచ్చన్నారు. అయితే భారత్‌లో వైరస్ కొత్తరూపు ఉందా లేదా అని నిర్ధారణ కాలేదని చెప్పారు.

కరోనా ప్రభావం మొదలైనప్పటినుంచి నేటి వరకూ ఉన్న పరిస్థితులగురించి ఉపరాష్ట్రపతికి పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. కరోనా ప్రభావాన్ని నిర్లక్ష్యం చేయడం కారణంగా 20 నుంచి 40 ఏళ్ల వయసున్న వారు ఎక్కువగా ప్రభావితమైన విషయాన్ని సీసీఎంబీ డైరెక్టర్ వెల్లడించారు.

మిగిలిన వయోపరిమితుల్లో కరోనా కారణంగా భయంతోపాటు జాగ్రత్త ఉండటం.. భారతదేశంలోని వాతావరణ పరిస్థితులు, సకాలంలో తీసుకుంటున్న చర్యలు తదితర కారణాలతో భారతదేశంలో కరోనా మృతుల సంఖ్య తక్కువగా ఉందన్న విషయాన్ని ఉపరాష్ట్రపతికి తెలియజేశారు.

ఐ/ఏ3ఐ రకం కరోనా వైరస్.. దక్షిణాసియా దేశాలనుంచి భారతదేశంలో ప్రారంభంలో ప్రభావం చూపించిందన్న సీసీఎంబీ డైరెక్టర్‌, ఈ ఏ3ఐ వైరస్ ప్రభావం తగ్గిన తర్వాత.. ప్రపంచవ్యాప్తంగా ప్రభావం చూపించిన ఏ2ఏ రకం వైరస్ ప్రభావం మొదలైందన్నారు.

ఆ సమయంలోనే కాస్త కేసుల సంఖ్య పెరిగిన విషయాన్ని ఉపరాష్ట్రపతి దృష్టికి తీసుకొచ్చారు. సీసీఎంబీ రూపొందించిన డ్రై స్వాబ్ డైరెక్ట్ ఆర్టీ-పీసీఆర్ పరీక్షను ఐసీఎంఆర్ ఆమోదం పొందిన విషయాన్ని కూడా ఉపరాష్ట్రపతికి డాక్టర్ రాకేశ్ మిశ్రా తెలిపారు.

అపోలో ఆసుపత్రి వంటి భాగస్వామ్య పక్షాలతో కలిసి ఈ కిట్లను భారీ సంఖ్యలో అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఆయన తెలిపారు. ఈ కిట్ల ద్వారా ప్రస్తుతం జరుగుతున్న కరోనా పరీక్షల ఖర్చు 40 శాతం తగ్గుతుందని.. 50 శాతం వేగంగా ఫలితాలను అందించవచ్చని ఉపరాష్ట్రపతికి వెల్లడించారు.

అనంతరం ఉపరాష్ట్రపతి తన అభిప్రాయాలను వెల్లడిస్తూ.. భారతదేశ వాతావరణంతోపాటు మన ప్రాచీన భారతీయ ఆహార పద్ధతుల కారణంగా కొంతమేర కరోనా ప్రభావాన్ని తట్టుకోగలిగామన్నారు. పట్టణాలకంటే గ్రామాల్లోనే ప్రజల్లో ఎక్కువ సామర్థ్యం ఉందన్న విషయాన్నీ ఆయన ప్రస్తావించారు.

శారీరక శ్రమ, సంప్రదాయ ఆహారపు అలవాట్లను అలవర్చుకున్నవారు తక్కువగా కరోనా ప్రభావానికి గురైన విషయం తన దృష్టికి వచ్చిందన్నారు. అయితే కరోనాకు ప్రభుత్వం, వైద్య నిపుణులు సూచించినట్లుగా మాస్కు, సురక్షిత దూరాన్ని మరికొంతకాలం కొనసాగించాలని.. ఆయన సూచించారు.

వీలైనంత ఎక్కువసంఖ్యలో కరోనా పరీక్షల కిట్లను అందుబాటులోకి తీసుకురావడంతోపాటు.. ఫలితాలను కూడా త్వరగా ఇవ్వడం ద్వారా వ్యాధి తీవ్రతను వీలైనంత త్వరగా అదుపులోకి తీసుకొచ్చేందుకు సాధ్యమౌతుందన్నారు.