గండిపేటలోని చైతన్య భారతి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (సిబిఐటి) కాలేజీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అనూహ్యంగా ఫీజులు విపరీతంగా పెంచడంతో గత వారం రోజులుగా సిబిఐటి కళాశాల విద్యార్థులు ఆందోళన కొనసాగిస్తున్నారు. తాజాగా సోమవారం ఆందోళన తీవ్రతరమైంది. దీంతో మేనేజ్ మెంట్ స్టూడెంట్స్ ఆందోళనను తట్టుకోలేక వారం రోజులపాటు కాలేజీకి సెలవులు ప్రకటించింది.

సిబిఐటిలో ఇంజనీరింగ్ చదివే విద్యార్థులు రోడ్లమీదకు వచ్చి ఆందోళన చేయడం విద్యార్థి వర్గాల్లో తీవ్ర అలజడి రేపింది. సిబిఐటిలో చదివే విద్యార్థుల ఫీజును లక్షా 13 వేల ఫీజును 2లక్షలకు కళాశాల యాజమాన్యం పెంచడంతో విద్యార్థులు అగ్గిమీద గుగ్గిలమయ్యారు.

తాజాగా సిబిఐటి విద్యార్థులు ఆందోళన తీవ్రతరం చేశారు. కాలేజీ ప్రిన్సిపల్ ఛాంబర్ లో భైటాయించి నిరసన షురూ చేశారు. ఫీజుల తగ్గింపు ప్రకటన వచ్చే వరకు ప్రిన్సిపాల్ గది నుంచి బయటకొచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. దీంతో కాలేజీలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

విద్యార్థులతో చర్చలు జరిపేందుకు ప్రిన్సిపాల్ ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ఫీజులు తగ్గించాల్సిందే అని విద్యార్థులు భీష్మించి కూర్చున్నారు. వారితో చర్చించేందుకు ప్రయత్నించిన ప్రిన్సిపాల్ విఫలమయ్యారు. మేనేజ్ మెంట్ అన్ని విషయాలను పరిశీలన చేస్తోందని ఆయన నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. ఫీజుల తగ్గింపుపై సానుకూల నిర్ణయం వచ్చే అవకాశముందని కూడా వివరించారు. కానీ విద్యార్థులు మాత్రం ఆందోళన కంటిన్యూ చేశారు.

విద్యార్థుల ఆందోళనకు విద్యార్థి సంఘాలు అన్నీ మద్దతు తెలిపాయి. ఆందోళన మరింత తీవ్రతరం అవుతున్న నేపథ్యంలో సిబిఐటి యాజమాన్యం కళాశాలకు వారం రోజుల పాటు సెలవులు ఇస్తూ ప్రకటన చేసింది. సెలవులు పూర్తయ్యేలోగా కాలేజీ యాజమాన్యం ఫీజుల తగ్గింపు విషయంలో కీలక ప్రటకన చేస్తుందా అన్న ఆశతో విద్యార్థులు ఉన్నారు.

 

సిబిఐటి విద్యార్థుల ఆందోళన వీడియో కోసం కింద లింక్ క్లిక్ చేయండి

http://telugu.asianetnews.com/video/gandipeta-cbit-students-stage-rasta-roko-in-hyderabad