Asianet News TeluguAsianet News Telugu

హైదరాబాద్‌లో కవితను సీబీఐ విచారించడం సాధ్యమేనా?.. తెరపైకి సరికొత్త చర్చ..!

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి సీబీఐ అధికారులు ఎమ్మెల్సీ కల్వకుంట్ల  కవితకు నోటీసులు జారీచేశారు. ఈ క్రమంలోనే హైదరాబాద్‌లోని నివాసంలో సీబీఐ అధికారులకు తాను నోటీసులపై వివరణ ఇవ్వనున్నట్టుగా కవిత చెప్పారు. ఈ క్రమంలోనే తెరపైకి సరికొత్త చర్చ వచ్చింది. 

CBI has no general consent in telangana then is it possible to question kalvakuntla kavitha in hyderabad
Author
First Published Dec 3, 2022, 9:44 AM IST

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి సీబీఐ అధికారులు  తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూతరు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల  కవితకు నోటీసులు జారీచేశారు. సీఆర్‌పీసీ సెక్షన్ 160 కింద ఈ నోటీసులు జారీ చేసినట్టుగా పేర్కొన్నారు. బంజారాహిల్స్‌లోని రోడ్ నంబర్ 12లోని కవిత నివాస చిరునామాను సీబీఐ నోటీసులో పేర్కొంది. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో విచారణ సందర్భంగా కవితకు సంబంధం ఉన్న కొన్ని వాస్తవాలను గుర్తించామని పేర్కొంది. అందువల్ల దర్యాప్తు కోసం ఆమె నుంచి వాస్తవాలను పరిశీలించాల్సిన అవసరం ఉందని తెలిపింది.

ఈ నెల 6వ తేదీ ఉదయం 11 గంటలకు విచారణ కోసం.. ఆమె సౌలభ్యం మేరకు హైదరాబాద్ లేదా ఢిల్లీలోని నివాస స్థలాన్ని తెలియజేయాలని కవితను సీబీఐ అధికారులు కోరారు. అయితే సీబీఐ నోటీసులు జారీ చేసిన  విషయాన్ని కవిత ధ్రువీకరించారు. ఈ నెల 6వ తేదీన హైదరాబాద్‌లోని తన నివాసంలో తనను కలుసుకోవచ్చని.. ఇంటి వద్దే వారికి వివరణ  ఇస్తాను అని కవిత చెప్పారు. 

అయితే తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో సీబీఐకి సాధారణ సమ్మతిని నిరాకరించిన నేపథ్యంలో.. హైదరాబాద్‌లోని కవిత నివాసంలో సీబీఐ అధికారలు వివరణ తీసుకోవడం అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తెలంగాణలో సీబీఐ అధికారులకు సాధారణ సమ్మతి లేనందున వారు ఎటువంటి వైఖరిని అవలంబిస్తారనేది తెలియాల్సి ఉంది. మరోవైపు ఢిల్లీలో లిక్కర్ స్కామ్ కేసు నమోదైనందున సీఆర్‌పీసీ సెక్షన్ 160 కింద హైదరాబాద్ నివాసికి నోటీసు ఇవ్వడం చట్టవిరుద్ధమని కొందరు న్యాయవాదులు అభిప్రాయపడుతున్నారు. అయితే కవితనే హైదరాబాద్‌లో తన నివాసానికి వచ్చి విచారించుకోవచ్చని చెప్పిన పక్షంలో.. తెలంగాణలో సీబీఐ ఎంట్రీకి గ్రీన్ సిగ్నల్ లభించినట్టేనా అనేది తెలియాల్సి ఉంది. 

అయితే ఇటీవల ఫేక్ సీబీఐ అధికారి శ్రీనివాస్ కేసుకు సంబంధించి తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్ ఇంటికి సీబీఐ అధికారులు వచ్చి నోటీసులు అందించిన సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి సీబీఐ నోటీసులు అందుకున్న మంత్రి గంగుల, ఎంపీ గాయత్రి రవిలు ఢిల్లీలోని సీబీఐ కార్యాలయానికి వెళ్లి అధికారులు ఎదుట హాజరైన సంగతి తెలిసిందే. ఈ పరిణామాల నేపథ్యంలో రాష్ట్రంలో సీబీఐ ఎంట్రీకి సంబంధించి వ్యవహారంలో.. అటు సీబీఐ నుంచి గానీ లేదా తెలంగాణ సర్కార్ నుంచి గానీ స్పష్టత రావాల్సి ఉంది. 

మొయినాబాద్ ఫామ్ హౌస్ కేసును సీబీఐ లేదా ప్రత్యేక దర్యాప్తు బృందంతో విచారణ చేయించాలని కోరుతూ బీజేపీ హైకోర్టును ఆశ్రయించిన సమయంలో.. తెలంగాణలో సీబీఐకి జనరల్ కన్సెంట్‌ను ఉపసంహరించుకున్న విషయం వెలుగులోకి వచ్చింది. ఇందుకు సంబంధించి ఈ ఏడాది ఆగస్టు నెలలోనే తెలంగాణ హోం శాఖ  జీవో నెంబర్ 51 జారీ చేసినట్టుగా తెలిసింది.

ఇక, ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌కు సంబంధించి నిందితుల్లో ఒకరైన అమిత్ అరోరా రిమాండ్ రిపోర్ట్‌లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు కల్వకుంట్ల కవిత‌తో సహా పలువురి పేర్లను ప్రస్తావించిన సంగతి  తెలిసిందే. కేసును దర్యాప్తు కోసం ఏజెన్సీకి అప్పగించిన తర్వాత కవిత తన మొబైల్ ఫోన్ ఇంటర్నేషనల్ మొబైల్ ఎక్విప్‌మెంట్ ఐడెంటిటీ (ఐఎంఈఐ)ని ఆరుసార్లు మార్చుకున్నారని ఈడీ అధికారులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. ఇంకా, ఐఎంఈఐ ఆధారంగా డేటాను విశ్లేషించినట్టుగా తెలిపింది. దర్యాప్తుకు ఆటంకం కలిగించడానికి డిజిటల్ సాక్ష్యం నాశనం చేయబడిందని కనుగొంది.

‘‘శరత్ చంద్రారెడ్డి, కవిత, మాగుంట శ్రీనివాసులు రెడ్డి, అమిత్ అరోరా నియంత్రణలో ఉన్న సౌత్ గ్రూప్‌ను ఏర్పాటు చేసి ఆప్ నాయకుల తరపున విజయ్ నాయర్ రూ. 100 కోట్ల ముడుపులు అందుకున్నట్లు దర్యాప్తులో తేలింది. ఇదే విషయాన్ని అమిత్ అరోరా వెల్లడించారు. దర్యాప్తును అడ్డుకునేందుకు ఉద్దేశపూర్వకంగానే విస్తృతమైన డిజిటల్ సాక్ష్యాలను ధ్వంసం చేశారు. కేసును ఏజెన్సీకి అప్పగించిన తర్వాత 36 మంది అనుమానితులు/నిందితులు తమ 176 సెల్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లను ధ్వంసం చేశారు. 170 సెల్‌ఫోన్‌లలో 17 సెల్‌ఫోన్‌ల నుంచి డేటాను తిరిగి పొందగలిగాం. అన్ని ఫోన్లు దొరికి ఉంటే ఈ కేసులో చేతులు మారిని మరిన్ని ముడుపులు వెలుగులోకి వచ్చేవి. ఇతర ముఖ్యమైన వ్యక్తుల ప్రమేయం మరింత స్పష్టంగా బయటపడి ఉండేది’’ అని ఈడీ పేర్కొంది.

Follow Us:
Download App:
  • android
  • ios