చలాన్లు పెండింగ్‌లో ఉండడంతో మీర్‌చౌక్ పోలీసులు ఎల్లయ్య బైక్‌ను సీజ్ చేశారు. దీంతో మనస్తాపానికి గురైన ఎల్లయ్య సోమవారం రాత్రి ఇంటికి వచ్చి విషం తాగి అత్మహత్య చేసుకున్నాడు.
ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించిన వారికి.. ట్రాఫిక్ పోలీసులు చలానాలు విధించడం చాలా కామన్ విషయం. ఆ చాలానాలు వేలకు వేలు పెరిగిపోతే....పోలీసులు ఆ వాహనాలను స్వాధీనం చేసుకుంటూ ఉంటారు. ఇలాంటి సంఘటనే ఓ వ్యక్తికి ఎదురైంది. అయితే... ఆ చలానాలు చెల్లించే స్థోమత లేక సదరు వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన తెలంగాణ రాష్ట్రంలో చోటుచేసుకోగా.... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
నల్లగొండ జిల్లా నేరడిగొమ్ము గ్రామానికి అన్నెపాక ఎల్లయ్య (50), మల్లమ్మ దంపతులు బతుకుతెరువు కోసం హైదరాబాద్‌కు వలస వచ్చి ఐఎస్ సదన్ డివిజన్ నీలం రాజశేఖర్ రెడ్డి నగర్ (చింతల్ బస్తీ)లో నివాసం ఉంటున్నారు. వీరికి ముగ్గురు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. ఎల్లయ్య హమాలీగా, మల్లమ్మ చంపాపేటలోని సాయిబాబా గుడిలో పనిచేస్తున్నారు.
ఎల్లయ్యకు మద్యం సేవిచే అలవాటు ఉంది. అతను మూడుసార్లు మద్యం తాగి పోలీసులకు చిక్కాడు. దీంతో... అతని బైక్ పై రూ.9వేలకు పైగా చలానాలు విధించారు. చలాన్లు పెండింగ్‌లో ఉండడంతో మీర్‌చౌక్ పోలీసులు ఎల్లయ్య బైక్‌ను సీజ్ చేశారు. దీంతో మనస్తాపానికి గురైన ఎల్లయ్య సోమవారం రాత్రి ఇంటికి వచ్చి విషం తాగి అత్మహత్య చేసుకున్నాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే డీఆర్‌డీఓ ఒవైసీ ఆస్పత్రికి తరలించగా అప్పటికే అతను మృతిచెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు.
చనిపోవడానికి ముందు ఎల్లయ్య సూసైడ్ నోట్ రాశాడు. దాంట్లో తమ లాంటి పేదలు అంత చలానాలు చెల్లించడం కష్టంగా ఉంటుందని.... అంతంత చలానాలు చెల్లించడం ఎలా కుదురుతుందని ఈ విషయంపై ఆలోచించాలి అంటూ.... మంత్రి కేటీఆర్ పేరు ప్రస్తావించి రాయడం గమనార్హం.
