తెలంగాణలో కొత్త విద్యా వ్యవస్థ మొదలవుతోంది. నియోకవర్గానికి ఒక గురుకులం ఏర్పాటు చేస్తోంది సర్కారు. పేద, మధ్య తరగతి విద్యార్థులను గురుకులాలు ఊరిస్తున్నాయి. ఒకవైపు ప్రభుత్వ పాఠశాలలు వేలాదిగా మూతపడుతుండగా మరోవైపు నియోజకవర్గానికి ఒక గురుకులం కొలువుదీరుతోంది. దీంతో గురుకులాల్లో సీట్ల కోసం కుస్తీ పడుతున్నారు పేద విద్యార్థులు.

తెలంగాణ సర్కారు కెజి టు పిజి ఉచిత నిర్భంద విద్య అమలు చేస్తామంటూ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించింది. ఆ దిశగానే గురుకులాలను ఏర్పాటు చేస్తోంది. అయితే విద్యర్థుల సంఖ్యకు, గురుకులాల సీట్లకు పంతన లేకుండా ఉంది. గురుకులంలో ఒక్కో సీటుకు ఐదుగురు విద్యార్థులు పోటీ పడే పరిస్థితి నెలకొంది. అంటే ఒకరికి సీటొస్తే మిగతా నలుగురి పరిస్థితి ఏంటన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది.

ఇక పిల్లలు రావడంలేదన్న నెపంతో సుమారు 4వేల ప్రభుత్వ పాఠశాలలను మూసివేస్తోంది తెలంగాణ సర్కారు. పిల్లలు లేకపోతే బడి నడపడమెందుకున్నది సర్కారు వాదన. పిల్లల సంఖ్య తక్కువగా ఉన్న పాఠశాలలను పక్క ఊరిలో ఉన్న పాఠశాలల్లో విలీనం చేస్తోంది. పక్క ఊరికి వెళ్లి చదువుకోవాల్సిన పరిస్తితి నెలకొన్న విద్యార్థులకు నెలకు 300 చొప్పున ఆటో కిరాయిలు చెల్లిస్తోంది.

తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటి వరకు కేవలం 315 గురుకులాలు ఉండగా తాజాగా వాటి సంఖ్యను 525కు పెంచింది తెలంగాణ సర్కారు. దీనిపై దేశంలోనే ఎక్కడా లేనంత సంఖ్యలో తెలంగాణలో గురుకులాలు ఏర్పాటు చేసి రికార్డులు సృష్టించామని గర్వంగా చెబుతోంది సర్కారు.

అయితే తెలంగాణ రాకముందు కులాలు లేవు, మతాలు లేవు సిఎం మనవడైనా, కూలీ కొడుకైనా ఒకే గురుకులంలో చదివేలా చర్యలు తీసుకుంటామని ప్రకటించిన కెసిఆర్ తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత కులానికో గురుకులం ఏర్పాటు చేయడం ఎందుకోసమే అని జనాల్లో ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఇప్పటికే మైనార్టీల కోసం మైనార్టీ గురుకులాలు, బిసిల కోసం బిసి గురుకులాలు, ఎస్సీల కోసం ఎస్సీ గురుకులాలు, ఎస్టీల కోసం ఎస్టీ గురుకులాలు ఏర్పాటు చేస్తున్నారు. మొత్తానికి ఈ కుల గురుకులాల ఏర్పాటు ఫలాలు ఎలా వస్తాయా అన్నది ఆచరణలో తేలనుంది.