మాజీ మంత్రి, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌కు షాక్ తగిలింది. ఆయన అనుచరుడు పోలు లక్ష్మణ్‌పై కరీంనగర్ రెండో పట్టణ పోలీసులు గురువారం కేసు నమోదు చేశారు. టీఆర్ఎస్‌తో పాటు ముఖ్యమంత్రి కేసీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ, విలేకరుల సమావేశం నిర్వహించాడంటూ నగరంలోని సుభాష్‌నగర్‌కు చెందిన రాయనవేని శ్రవణ్ ముదిరాజ్ ఫిర్యాదు చేశారు. దీని ఆధారంగా పోలు లక్షణ్‌పై ఐపీసీ 153, 505( 2) కింద కేసు నమోదు చేశారు.

ఉత్తర తెలంగాణ భవన్‌ను స్వాధీనం చేసుకుంటామని, ప్రగతి భవన్‌పై రాళ్ళ దాడి చేస్తామంటూ లక్ష్మణ్ బెదిరింపులకు గురిచేశారు. అలాగే మంత్రి గంగుల కమలాకర్.. ఈటల కాలి గోటికి కూడా సరిపోడంటూ అవమానకరంగా మాట్లాడాడంటూ శ్రవణ్ ఫిర్యాదు పేర్కొన్నాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 

Also Read:హుజూరాబాద్‌లో ఎన్నికలు జరిగితే ప్రజలంతా అండగా ఉంటారు: గంగులపై ఫైర్

అంతకుముందు ఈటల రాజేందర్‌కు అత్యంత సన్నిహితునిగా ముద్రపడ్డ బండ శ్రీనివాస్ షాకిచ్చారు. టీఆర్ఎస్ రాష్ట్ర బాధ్యతలు నిర్వర్తిస్తున్న బండ శ్రీనివాస్ బుధవారం హుజురాబాద్‎లో మీడియాతో మాట్లాడుతూ… ప్రలోభాలకు గురై అమ్ముడు పోయే బిడ్డలం మాత్రం తాము కాదని స్పష్టం చేశారు. 

ఇంత కాలం మీతో కలిసి పనిచేసిన మాకు ఎన్ని డబ్బులు ఇచ్చారో వివరించాలని డిమాండ్ చేశారు. ఉద్యమంలో మీతో పాటు జైలుకు వచ్చిన తాము అభివృద్దితో పాటు అన్నింటా  కలిసి పనిచేశాం.. కానీ ఏమైనా ఆశించామా అని ప్రశ్నించారు. ఈటల పార్టీ కోసం ఖర్చు పెట్టాడేమో కానీ, మా వ్యక్తిగత అవసరాల కోసం ఎప్పుడూ డబ్బులు ఇవ్వలేదన్నారు. 

అనంతరం మునిసిపల్ చైర్ పర్సన్ గందె రాధిక మాట్లాడుతూ… సీఎం కేసీఆర్ ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలను చూసి ఇతర పార్టీల నాయకుల టీఆర్ఎస్ పార్టీలోకి వస్తుంటే ఈ పార్టీలోంచి తాము బయటకు వెల్లడం ఏంటన్నారు. ప్రలోభాలకు గురవుతున్నామని మాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని తాము అలాంటి నాయకులం కాదని స్పష్టం చేశారు