బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ డిమాండుకు కేంద్ర ప్రభుత్వం దిగొచ్చింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ పరీక్షలను ప్రాంతీయ భాషల్లో నిర్వహించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేసింది.

బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ డిమాండ్ ను కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. సీఏపీఎఫ్ కానిస్టేబుల్ ఉద్యోగాల‌ (CAPF Constable exams)ను ప్రాంతీయ భాషల్లో నిర్వహించాలని బీఆర్ఎస్ చేసిన డిమాండ్ కు మోడీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కేంద్ర స్థాయి ఉద్యోగ పరీక్షలను కేవలం హిందీ, ఇంగ్లీషు భాషల్లో మాత్రమే నిర్వహించడం వల్ల ఇతర ప్రాంతీయ భాషల అభ్యర్థులు ఇబ్బందులు పడుతున్నారని ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ప్రధానికి దృష్టికి తీసుకెళ్లారు.

ఈ విషయంపై కేంద్రం సానుకూలంగా స్పందించింది. సీఏపీఎఫ్ కానిస్టేబుల్ ఉద్యోగాల పరీక్షల (CAPF Constable exams)తో పాటు వివిధ కేంద్ర మంత్రిత్వశాఖల్లోని గ్రూప్- బి, గ్రూప్-సి ఉద్యోగాల కోసం నిర్వహించే స్టాఫ్ సెలక్షన్ కమిషన్(ఎస్ఎస్‎సీ) పరీక్షను మరో 13 ప్రాంతీయ భాషల్లో నిర్వహించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. తెలుగు, అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, మరాఠీ, మలయాళం, కన్నడ, తమిళం, ఒడియా, ఉర్దూ, పంజాబీ, మణిపురి, కొంకణి భాష‌ల్లో 2024 జనవరి 1 నుంచి ఈ విధానాన్ని అమలు చేస్తామని కేంద్ర ప్రభుత్వం త‌న‌ ప్రకటనలో పేర్కొన్న‌ది.

ఇటీవల సీఆర్‌పీఎఫ్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ ప‌రీక్ష‌ల‌ను ప్రాంతీయ భాష‌ల్లో నిర్వ‌హించాల‌ని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్ .. కేంద్ర‌హోంశాఖ మంత్రి అమిత్ షాకు లేఖ రాసిన విష‌యం తెలిసిందే. హిందీ, ఇంగ్లీషు భాషల్లో మాత్రమే పరీక్షలు నిర్వహించడం వల్ల ఇతర ప్రాంతీయ భాషల అభ్యర్థులు ఇబ్బందులు పడుతున్నారని వెల్లడించారు.

కంప్యూట‌ర్ ఆధారిత ప‌రీక్ష‌ల‌ను కేవ‌లం ఇంగ్లీష్‌, హిందీ భాష‌ల్లో నిర్వ‌హించడం వల్ల ఇత‌ర ప్రాంతీయ భాష‌ల అభ్య‌ర్థుల భ‌విష్య‌త్తు గందరగోళంలోనికి నెట్టివేయబడుతుందని మంత్రి కేటీఆర్ తన లేఖలో పేర్కొన్నారు. అలాగే జాతీయ స్థాయి పోటీ పరీక్ష‌ల‌ను కేవ‌లం హిందీలోనే నిర్వ‌హించ‌డం అది రాజ్యాంగ స్పూర్తికి విరుద్ధ‌మ‌ని, మన దేశంలో ఎన్నో అధికార భాష‌లు ఉన్నాయ‌ని మంత్రి కేటీఆర్ త‌న లేఖ‌లో పేర్కొన్నారు. సీఆర్పీఎఫ్ నోటిఫికేష‌న్ ప్ర‌జ‌ల హ‌క్కుల్ని హ‌రిస్తోంద‌ని, రాజ్యాంగం అందించిన స‌మాన‌త్వ అవకాశాల‌ను ఇతర ప్రాంత ప్రజలు అందుకోలేకపోతున్నారని మంత్రి కేటీఆర్ త‌న లేఖ‌లో పేర్కొన్నారు. ఇదే అంశంపై సీఎం కేసీఆర్ కూడా 2020, న‌వంబ‌ర్ 18వ తేదీన కేంద్రానికి లేఖ రాసిన‌ట్లు తెలిపారు.