పెద్ద నోట్లు మార్చే రూటు ఇదే పాత నోట్లతో కూరగాయలు కొనే సౌకర్యం ఎర్రగడ్డ రైతు బజారు లో మాత్రమే అవకాశం
హెడ్డింగ్ చూసి అవధానానికి కావాల్సిన పదాలిచ్చాం.. పద్యం చెప్పండి అని అడిగాం అనుకుంటున్నారా.. అదేం కాదు.. పెద్ద నోట్ల రద్దుతో మీరు పడుతున్న తిప్పలు గమనించి మీకు చెబుతున్న తారక మంత్రం ఇది.
రద్దైన రూ. 500, రూ. 1000 నోట్ల తో కూరగాయలు కొనుక్కొనే గొప్ప సౌకర్యం ఇప్పుడు హైదరాబాద్ వాసులకు అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతానికైతే ఎర్రగడ్డ రైతు బజార్‌లో మాత్రమే ప్రత్యేకంగా కౌంటర్ పెట్టి కేంద్రీయ భండార్ సంస్థ ద్వారా రూ. 500 విలువైన నిత్యావసరాల ప్యాక్‌లను వినియోగదారులకు అమ్ముతున్నారు. ఇక్కడ పాత నోట్లు ఇచ్చినా ఎలాంటి అభ్యంతరం లేకుండా తీసుకుంటారు.
నోట్ల రద్దుతో రైతు బజార్లలలోని కూరగాయలన్నీ కుళ్లిపోయి తీవ్ర నష్టాలు వస్తుండడంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.
పది రోజుల నుంచి ఎప్పుడూ రద్దీగా ఉండే మార‍్కెట్లు జనాలు లేక ఖాళీగా కనిపిస్తున్నాయి. చిల్లర లేక, ఉన్న పాత నోట్లను మార్పుకోలేక సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు కూరగాయల ధరలు కూడా విపరీతంగా పడిపోవడంతో రైతులు లబోదిబోమంటున్నారు.
ఈ నేపథ్యంలోనే అధికారులకు ఈ ఐడియా వచ్చింది. దీంతతో వెంటనే ఈ బంపర్ ఆఫర్ ను ఎర్రగడ్డ రైతు బజార్‌లో ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టారు.
ఈ రైతు బజారులో 7 నిత్యావసర వస్తువులను రూ.500 లకే ఒక ప్యాక్ లో అందచేసేలా ఏర్పాట్లు చేశారు.
అయితే బ్లాక్ మనీని వైట్ చేయాలనుకునే బడాబాబులకు ఈ రైతు బజార్లు పెద్దగా ఉపయోగపడకపోవచ్చు. ఎందుకంటే ఒక్కోరికి పరిమితి మేరకే పెద్ద నోట్లతో ఈ ప్యాక్ లను విక్రయిస్తారట.
