Asianet News TeluguAsianet News Telugu

ఈ మూడూ తేల్చకుంటే రేవంత్ రెడ్డికి మూడిందే!!?

రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి పదవి వచ్చింది. కానీ అది ఓ ముళ్ల కిరీటం. ఆ సీటు చుట్టూ ఉన్న మూడు సమస్యల ముళ్లు ఆయనను కుదురుకోనివ్వకుండా చేసే అవకాశం ఉంది. 

Can Revanth Reddy overcome these three challenges as CM? - bsb
Author
First Published Dec 7, 2023, 8:59 AM IST

హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రిగా అనుముల రేవంత్ రెడ్డి గురువారం మధ్యాహ్నం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. తెలంగాణకు రెండో సీఎంగా ఆయన తన నాయకత్వాన్ని నిరూపించుకోనున్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత గడిచిన పదేళ్లలో సాగిన పాలన రేవంత్ రెడ్డి ముందు అనేక సవాళ్లను నిలిపింది. 

రేవంత్ రెడ్డికి ముందున్న సవాళ్లల్లో కేసీఆర్ కు ధీటుగా పార్టీని సమైక్యంగా ఉంచుకుంటూ పరిపాలన చేయడం. ఎటువంటి (మత) కలహాలు లేకుండా.. ప్రజలకు భరోసానిచ్చే ప్రభుత్వాన్ని నడపడం.. ఇవి కాకుండా అత్యంత కీలకంగా చెప్పుకునే మూడు సవాళ్లు ఇవి. 

రేవంత్ రెడ్డికి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఉన్న ముఖ్యమైన 5 పోలికలివే..

ఒకటి.. రేవంత్ రెడ్డి ముందున్న అతి పెద్ద సవాల్ కేంద్రం. కాంగ్రెస్ మీద కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కారాలుమిరియాలు నూరుతుంది. సందు దొరికితే చాలు ఇబ్బంది పెట్టడానికి శతవిధాలా ప్రయత్నిస్తూనే ఉంది. రాహుల్ పార్లమెంట్ సభ్యత్వం రద్దు చేయడం, అధికారిక నివాసాన్ని ఖాళీ చేయించడం లాంటి ఉదంతాలు ఇద్దరి మధ్య ఉన్న తీవ్ర వైరాన్ని చూపుతాయి. ఇక ఇప్పుడు అదే కాంగ్రెస్ నుంచి తెలంగాణ ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యాడు రేవంత్ రెడ్డి. ఈ క్రమంలో కేంద్రం నుంచి రేవంత్ కు సాయం దక్కడం అనుమానమే. ఇంకా చెప్పాలంటే ఇబ్బందులు పెట్టే ప్రయత్నాలు కూడా చాలా ఎక్కువే అని చెప్పొచ్చు.

మాజీ సీఎం కేసీఆర్ ఎంత తాను బీజేపీ వ్యతిరేకమని చెప్పినా ఇద్దరి మధ్య లోపాయకారి ఒప్పందం ఉందన్న విషయం అందరికీ తెలిసిందే. దీంతో కేంద్రం నుంచి కేసీఆర్ కు పెద్దగా ఇబ్బందులు ఎదురయ్యింది ఏమీ లేదు. కానీ రేవంత్ రెడ్డి విషయానికి వచ్చేసరికి వైరం స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పుడు దాన్ని ఎదుర్కోవడం, రాష్ట్రాన్ని పాలించడం కత్తిమీద సామే.

రెండో సమస్య.. జగన్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన నాటినుంచి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు మంచి టర్మ్స్ ఉన్నాయి. వీరిద్దరూ మంచి స్నేహితులు కూడా. ఇచ్చిపుచ్చుకునే పద్ధతి ఉంది. దీంతో రెండు రాష్ట్రాల మధ్య గొడవలొచ్చినా సామరస్యపూర్వకంగానే సద్దుమణిగాయి. కానీ ఇప్పుడు పరిస్థితి అదికాదు. ఇక్కడ అధికారంలోకి వచ్చింది రేవంత్ రెడ్డి. తన శత్రువైన కాంగ్రెస్ పార్టీ నేత. జగన్, కేసీఆర్ బంధం ఎంత బలమైందో నిరూపించడానికి ఎన్నికల రోజు తెల్లవారుజామున నాగార్జున సాగర్ డ్యాం దగ్గర జరిగిన పరిస్థితే అద్దం పడుతుంది. సో... పొరుగు రాష్ట్రాన్ని ఎదుర్కోవడం ఇప్పుడు మరో సమస్య.

మూడో ముఖ్యమైన సమస్య.. అప్పులు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన  తరువాత ప్రజలకు ఇచ్చిన 24 గంటల కరెంట్, నీళ్లు, ప్రాజెక్టులు, అభివృద్ధి, సంక్షేమ పథకాల పేరుతో కేసీఆర్ ఎన్నో లక్షల కోట్ల అప్పులు తెచ్చాడు. ముఖ్యంగా 24 గంటల కరెంట్ కోసం పక్క రాష్ట్రాల నుంచి ఎక్కువ డబ్బులకు కరెంటును కొనుగోలు చేశారు. ఇప్పుడా అప్పులన్నీ రేవంత్ రెడ్డి ప్రకటించిన ఆరు గ్యారంటీల అమలుకు పాముల్లా చుట్టుకుంటాయి. 

దీనికి తోడు ప్రస్తుతం ప్రతిపక్షంగా మారిన బీఆర్ఎస్ పాలన సాగకుండా చేసే పనులు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉండేది కొద్దిరోజులే, నాలుగు నెలల్లోనే తెలంగాణ ప్రజలకు తాము చేసిన తప్పేంటో అర్థం అవుతుంది అంటూ మొదలుపెట్టిన నెగెటివ్ టాక్. దీన్ని అధిగమించి పాలనను చూపించగలగాలి. ఇవన్నీ కలిసి రేవంత్ రెడ్డికి పాలన అంత వీజీ కాదు...

Follow Us:
Download App:
  • android
  • ios