వరంగల్ అర్బన్ కలెక్టర్ ఆమ్రపాలి తీరును వరంగల్ జిల్లాలోని ప్రతిపక్ష పార్టీలు తప్పు పడుతున్నాయి. ఆమ్రపాలి ఒక కలెక్టర్ గా వ్యవహరించాలి తప్ప పార్టీ కార్యకర్తగా కాదని విపక్షాలు గుర్తు చేస్తున్నాయి. మరి కలెక్టరమ్మ ఆమ్రపాలి చేయకూడని పనేంటబ్బా అనుకుంటున్నారా? అయితే ఈ స్టోరీ చదవండి.

శనివారం నాడు తెలంగాణ ఐటి, పురపాలక శాఖ మంత్రి కేటిఆర్ వరంగల్ జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా అధికార పార్టీ ఎమ్మెల్యేలను, పార్టీ నేతలను కడిగి పారేశారు కేటిఆర్. స్థానిక ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ ను అయితే కొద్దగా డోస్ పెంచి మరీ క్లాస్ తీసుకున్నారు. ఇలా చేస్తే ఎలా అంటూ కేటిఆర్ అధికార పార్టీ నేతల తీరు పై గుర్రుగా ఉన్నారు.

ఇదిలా ఉండగా అధికారులను సైతం వదలలేదు కేటిఆర్. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలనే మీరు పట్టించుకోవడంలేదంటే..? ఇక ఎవరి హామీలు పట్టించుకుంటారని నిలదీశారు. హౌసింగ్ విషయంలో కేటిఆర్ కు కోపం నషాలానికి అంటింది. దీనిపై హౌసింగ్ అధికారిని నీళ్లు తాగేలా చేశారు. ఇదే విషయమై తన అధికారిని కవర్ చేసే ప్రయత్నం చేసిన ఆమ్రపాలి కూడా కేటిఆర్ ఆగ్రహాన్ని చవిచూశారు. ఆమ్రపాలిని పేరు పెట్టి మరీ హెచ్చరించేవరకు వెళ్లారు కేటిఆర్. ఈ పరిణామాలు అధికార వర్గాలను అప్రమత్తం చేశాయన్న ప్రచారం ఒకవైపు ఉంటే... మరోవైపు నిధులియ్యకపోతే మేము మాత్రం ఏం చేస్తాం అంటూ అధికార వర్గాల నుంచి వస్తున్న మరోవాదన.

ఇక కేటిఆర్ పర్యటన నేపథ్యంలో ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డాయి. స్థానిక నేత ఉపముఖ్యమంత్రి అయిన కడియం శ్రీహరి తన స్థాయి, హోదా మరచి చిన్నవాడైన మంత్రి కేటిఆర్ ముందు మోకరిల్లాడని టిడిపి సీనియర్ నేత రేవూరి ప్రకాష్ రెడ్డి విమర్శించారు. ఉపముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి ప్రభుత్వ పథకాలు అమలైతలేవని తన కంటే వయసులోనూ, హోదాలోనూ తక్కువ స్థాయిలో ఉన్న కేటిఆర్ కు ఫిర్యదు చేయడం చూస్తే ఆయన ఎంతగా దిగజారిపోయారో అర్థమైందన్నారు. కేటిఆర్ తన పర్యటనను పూర్తిగా అహంకారపూరితంగా చేపట్టారని మండిపడ్డారు. సిఎం కేసిఆర్ ఇచ్చిన హామీలకే దిక్కులేదని కేటిఆర్ అంగీకరించారని, ఇఫ్పటికైనా ఇచ్చిన హామీలన్నీ అమలు చేసే దిశగా సర్కారు కదలాలని సూచించారు. 2015లో సిఎం కేసిఆర్ వరంగల్ నగరంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు శంకుస్థాపన చేస్తే ఇప్పటి వరకు అతీగతీ లేదన్నారు.

సందుట్లో సడేమియా అన్నట్లు జిల్లా కలెక్టర్ ఆమ్రపాలికి కూడా చురకలంటించారు రేవూరి. ఒక మంత్రి నగర పర్యటనకు వస్తే కలెక్టర్ గా ఉన్న వ్యక్తి మంత్రికి స్వాగతం పలికేందుకు హెలిప్యాడ్ వద్దకు పరుగెత్తి పోవాల్సిన అవసరం లేదన్నారు. ఈ విషయం ఆమ్రపాలికి తెలియక వెళ్లారా లేక అత్యుత్సాహం చూపారా అన్నది తేలాలన్నారు. మంత్రి వస్తే కలెక్టరేట్ లో జరిగే రివ్యూ సమావేశాల్లో పాల్గొనవచ్చు కానీ స్వాగతం పలికేందుకు కార్యకర్తల మాదిరిగా హెలిక్యాప్టర్ వద్దకు వెళ్లడం సరికాదన్నారు. దీన్నిబట్టి చూస్తే ఎవరు రాజరికం అనుభవిస్తున్నారో తేలిపోయిందని విమర్శించారు రేవూరి.

 

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

https://goo.gl/fJWa5i