భూపాలపల్లి: కాల్ మనీ కారణంగా తల్లీ కూతుళ్లు ఆత్మహత్య చేసుకున్న విషాద సంఘటన రాష్ట్రంలో చోటుచేసుకుంది.  జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఈ దారుణం జరిగింది.

జిల్లాలోని మహదేవపూర్ మండలం కన్నెపల్లికి చెందిన వేమునూరి సమత కూతురు అశ్వినితో కలిసి జీవిస్తోంది. అయితే కుటుంబ పోషణ కోసం ఇటీవల అప్పులు చేశారు. అయితే అప్పులు తీర్చక పోవడంతో లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని... దీంతో తల్లీకూతుళ్లు ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు చెబుతున్నారు. పురుగుల మందు తాగి తల్లీకూతుళ్లు ఆత్మహత్య చేసుకున్నారు.

ఈ ఆత్మహత్యలపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం మహదేవపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

మరోవైపు హైదరాబాద్ లో కూడా రోజురోజుకు కాల్ మనీ కేసులు అధికమవుతున్నాయి. ఆదివారం ఒక్కరోజే 16 కేసులు నమోదయ్యాయి. అవసరం కోసం తీసుకున్న అప్పులకు వడ్డీ,చక్రవడ్డీలు వసూలు చేస్తూ రక్తాన్ని పీలుస్తున్నాయి ఈ కాల్ మనీ గ్యాంగులు. కొందరు వ్యాపారులైతే హద్దులు దాటి అప్పు తీసుకున్న మహిళలను లైంగిక వేధింపులకు గురిచేస్తున్నారు. వారి బారిన పడుతున్న బాధితుల సంఖ్య హైదరాబాద్ లోనే కాదు రాష్ట్రవ్యాప్తంగా పెరిగిపోతోంది.