తన కాళ్లు విరిగినా.. ప్రయాణికుల ప్రాణాలు కాపాడాడు

bus driver saves 38 members life in kodada bus accident
Highlights

38మంది ప్రాణాలు కాపాడిన డ్రైవర్

ప్రశాంతంగా వెళ్తున్న బస్సుకి అనుకోని రీతిలో ప్రమాదం ముంచుకొచ్చింది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్ రెండు కాళ్లు పోగొట్టుకున్నాడు. ఇంకొకరైతే తన ప్రాణాల కోసం పాకులాడేవాడేమో.. కానీ.. ఈ బస్సు డ్రైవర్ మాత్రం తన కర్తవ్యాన్ని నిర్వర్తించాడు.  తన ప్రాణాలను అడ్డుపెట్టి మరి ప్రయాణికుల ప్రాణాలు కాపాడాడు. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణ పరిధిలోని శ్రీరంగాపురం ఈ ఘటనకు వేదికైంది.

 ప్రయాణికులు, ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం... ఏపీఎస్‌ ఆర్టీసీ ఆటోనగర్‌ డిపో గరుడ బస్సు ప్రయాణికులతో హైదరాబాద్‌ నుంచి విజయవాడకు వెళ్తోంది. కోదాడ పట్టణ పరిధిలోని శ్రీరంగాపురం సమీపంలో రోడ్డు దాటే క్రమంలో ఉన్నట్టుండి రహదారి మధ్యలోకి దూసుకొచ్చిన ట్రాక్టర్‌ను ఢీకొంది. 

ఈ ప్రమాదంలో బస్సు కుడి భాగం నుజ్జయింది. డ్రైవర్ ఎన్‌.ఎ.శేషు రెండు కాళ్లు విరిగిపోయాయి. ఆ పరిస్థితిలోనూ ఆయన ధైర్యం సడల లేదు. నియంత్రణా కోల్పోలేదు. బస్సును జాతీయ రహదారి నుంచి దించి సుమారు 70 మీటర్ల దూరంలోని చదునైన ప్రాంతంలో సురక్షితంగా నిలపడంతో ప్రయాణికులు ఊపిరిపీల్చుకున్నారు. 

స్థానికులు గాయపడిన  బస్సు డ్రైవర్ శేషు, ట్రాక్టర్‌ డ్రైవర్ వెంకటేశ్వర్లుతోపాటు.. బస్సులోని మరో ప్రయాణికుణ్ని స్థానిక ఆసుపత్రిలో చేర్పించారు. పరిస్థితి విషమించడంతో శేషును విజయవాడకు తరలించారు.

loader