హైదరాబాద్:పాతబస్తీకి చెందిన ఆస్మాబేగం కేసులో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. రెండేళ్ల క్రితం ఆస్మాకు బుల్లెట్ గాయమైనట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు.

ఈ నెల 21వ తేదీన నిమ్స్ ఆసుపత్రిలో  చికిత్స చేసి  ఆస్మా బేగం వెన్నులో ఉన్న బుల్లెట్‌ను వైద్యులు తీశారు. ఈ విషయాన్ని పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఆస్మాబేగం కుటుంబసభ్యులను ప్రశ్నిస్తున్నారు.

Also read:వెన్నునొప్పి ఆపరేషన్ చేస్తే బుల్లెట్ దొరికింది

రెండేళ్ల క్రితం ఆస్మాకు నాటుతుపాకీ గాయమైనట్టుగా పోలీసులు గుర్తించారు. నాటు తుపాకీ బుల్లెట్ ఆమె శరీరంలోకి ఎలా వచ్చిందనే విషయాన్ని పోలీసులు  ఆరా తీస్తున్నారు.

ఆస్మా బేగం బుల్లెట్ గాయం నుండి రక్తస్రావం కాకుండా నొప్పి తగ్గేందుకు గాను నాటు వైద్యం చేయించుకొన్నట్టుగా పోలీసులు గుర్తించారు. ఆస్మా బేగం సెల్‌ఫోన్ ను పోలీసులు సీజ్ చేశారు. ఆమె కాల్ రికార్డ్స్ ను పోలీసులు పరిశీలిస్తున్నారు. ఈ బుల్లెట్ గాయం గురించి పోలీసులకు ఫిర్యాదు ఎందుకు చేయలేదనే విషయమై ఆరా తీస్తున్నారు. 

ఇంటి వద్దనే నాటు వైద్యం ఎందుకు చేశారనే విషయమై కూడ పోలీసులు ఆరా తీస్తున్నారు. అతి దగ్గర నుండి కాల్పులు జరిపితే బుల్లెట్  శరీరం నుండి బయలకు వచ్చేదని పోలీసులు అభిప్రాయపడుతున్నారు. దూరం నుండి కాల్పులు జరపడంతోనే ఆమె శరీరంలోకి బుల్లెట్ చేరిందనే అభిప్రాయంతో పోలీసులు ఉన్నారు. 

2017 నుండి ఆస్మా బేగం వెన్నునొప్పితో బాధపడుతున్నట్టుగా పంజగుట్ట ఏసీపీ తిరుపతన్న చెప్పారు. ఆమె శరీరంలోకి బుల్లెట్ ఎలా చేరిందనే విషయమై తాము లోతుగా దర్యాప్తు చేస్తున్నట్టుగా తెలిపారు.