హైదరాబాద్:హైద్రాబాద్‌లో రెండు నెలలుగా  వెన్నునొప్పితో బాధపడుతున్న యువతికి ఆపరేషన్ చేస్తే తూటా దొరికింది. దీంతో నిమ్స్  వైద్యులు పోలీసులకు సోమవారం నాడు సమాచారం ఇచ్చారు. ఈ విషయమై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

హైద్రాబాద్‌‌లోని బహదూర్‌పుర మండలం జహానుమా ప్రాంతానికి చెందిన అబ్దుల్ ఖాదర్ కుమార్తె అస్మా బేగం  రెండు నెలల క్రితం వెన్నునొప్పితో నిమ్స్‌ లో వైద్యం కోసం వచ్చింది.  కానీ, ఆమెకు నయం కాలేదు. నెల రోజుల తర్వాత ఆమె మళ్లీ ఆసుపత్రికి వచ్చింది. 

దీంతో ఈ నెల 21వ తేదీన ఆమెకు వైద్యులు ఎక్స్‌రే తీయించారు. వెన్నుపూసలో ఎల్1-ఎల్2 భాగంలో ఏదో వస్దువు ఉన్నట్టుగా వైద్యులు గుర్తించారు. దీని కారణంగానే వెన్నునొప్పి వస్తోందని వైద్యులు బావించారు. దీన్ని బయటకు తీసేందుకు ఆపరేషన్ చేశారు. శస్త్రచికిత్స చేస్తే ఆమె శరీరం నుండి తుపాకీ తూటా బయటకు వచ్చింది.

దీన్ని మెడికో లీగల్ కేసుగా భావించి పంజగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు నిమ్స్ వైద్యులు.  ఈ నెల 22వ తేదీన బాధితురాలిని ఆసుపత్రి నుండి ఇంటి నుండి పంపించారు.  బుల్లెట్ ఆమె శరీరంలోకి ఎలా వచ్చిందనే విషయాన్ని వైద్యులకు బాధితురాలు కుటుంబసభ్యులు చెప్పలేదని సమాచారం. 

ఏడాదిన్నర కాలంగా ఆమె వెన్నులో తూటా ఉన్నట్టుగా వైద్యులు అనుమానిస్తున్నారు. ఈ కేసును త్వరలోనే చేధిస్తామని పోలీసులు చెబుతున్నారు.రెండేళ్ల క్రితం ఆస్మాపై గుర్తు తెలియని వ్యక్తి కాల్పులు జరిపినట్టుగా పోలీసులకు చెప్పారని సమాచారం. 

అయితే ఎవరు ఆమెపై కాల్పులు జరిపారు, ఎందుకు కాల్పులు జరిపారు, కాల్పులు జరిపిన తర్వాతత ఎందుకు పోలీసులకు చెప్పలేదనే విషయాలపై కూడ పోలీసులు ప్రశ్నించినట్టుగా తెలుస్తోంది. మొత్తానికి ఈ విషయమై పోలీసులు  అసలు విషయాన్ని తేల్చే పనిలో పడ్డారు.