మెడికో ప్రీతి మరణించిన ఘటన మరవకముందే తెలంగాణలో మరో విద్యార్ధిని ర్యాగింగ్‌కు బలైంది. వరంగల్ జిల్లా భూపాలపల్లిలోని ఓ ప్రముఖ ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతోన్న రక్షిత ఆత్మహత్య చేసుకుంది.
తెలంగాణలో ర్యాగింగ్‌కు మరో విద్యార్థిని బలి అయింది. వరంగల్ జిల్లాలో సీనియర్ల వేధింపులతో రక్షిత అనే ఇంజనీరింగ్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఆమె వయస్సు 20 ఏళ్లు. ఓ ప్రముఖ ఇంజనీరింగ్ కాలేజీలో ఈ సంఘటన జరిగింది. రక్షిత స్వస్థలం భూపాలపల్లి. మరోవైపు మెడికో ప్రీతి మరణించిన రోజునే ఈ సంఘటన చోటు చేసుకోవడం తీవ్రంగా కలకలం రేపుతోంది.
ఇకపోతే.. ఆత్మహత్యాయత్నం చేసిన వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజ్ విద్యార్ధిని డాక్టర్ ప్రీతి కన్నుమూశారు. ఈ మేరకు నిమ్స్ వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. ఐదు రోజుల పాటు మృత్యువుతో పోరాటం చేసిన ఆమె చివరికి అలసిపోయారు. ప్రీతిని కాపాడేందుకు వైద్యులు తీవ్రంగా ప్రయత్నించారు. అయితే మల్టీ ఆర్గాన్స్ ఫెయిల్ కావడం, ఎక్మో సపోర్టుతో వెంటిలేటర్‌పై చికిత్స అందించారు. శుక్రవారం సీపీఆర్ నిర్వహించి గుండె పనితీరును మెరుగుపరిచారు. అయితే ఆదివారం ఆమె ఆరోగ్య పరిస్ధితి విషమించింది. ఈ క్రమంలో రాత్రి 9.10 గంటలకు ప్రీతి మరణించినట్లు నిమ్స్ వైద్యులు ప్రకటించారు. ఆమెను అన్ని రకాలుగా బతికించేందుకు ప్రయత్నించామని.. కానీ కాపాడలేకపోయామని వైద్యులు హెల్త్ బులెటిన్‌లో తెలిపారు.
ALso REad: విషాదం : ఫలించని వైద్యుల యత్నాలు.. డాక్టర్ ప్రీతి కన్నుమూత, మృత్యువుతో పోరాటంలో ఓటమి
కాగా.. జనగామ జిల్లాకు చెందిన ప్రీతి.. వరంగల్‌లోని కాకతీయ మెడికల్ కాలేజీలో పీజీ (అనస్థీషియా) చదువుతోంది. మహాత్మాగాంధీ మెమోరియల్ (ఎంజీఎం) ఆస్పత్రిలో శిక్షణలో ఉన్న సమయంలో ఉదయం 6:30 గంటల ప్రాంతంలో విషపూరిత ఇంజక్షన్ వేసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లుగా తెలుస్తోంది. ప్రీతిని అపస్మారక స్థితిలో ఉండటం గమనించిన ఆసుపత్రి సిబ్బంది సీనియర్ వైద్యులక సమాచారం అందించారు. వారు ఆమెను అత్యవసర వార్డుకు తరలించి చికిత్స అందించారు. ఆ తర్వాత మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని నిమ్స్‌కు తరలించారు.
ఇక, సీనియర్ విద్యార్థి సైఫ్ వేధింపుల కారణంగానే ఆమె ఆత్మహత్య యత్నంచినట్టుగా పోలీసులు గుర్తించారు. సైఫ్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుతో పాటు ర్యాగింగ్ నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసినట్టుగా పోలీసులు చెప్పారు. ఈ క్రమంలోనే సైఫ్‌ను అదుపులోకి తీసుకున్నట్టుగా పోలీసులు ప్రకటించారు. శుక్రవారం సైఫ్‌ను హన్మకొండలోని కోర్టులో హాజరుపరచగా.. న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు. అనంతరం సైఫ్‌ను ఖమ్మం జైలుకు తరలించారు.
