టీఎస్ పిఎస్సి పేపర్ల లీకేజీ వ్యవహారం కేసీఆర్ ప్రభుత్వాన్ని కూల్చే స్థాయిలో వుందని బిఎస్పీ నేత ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేసారు. 

హైదరాబాద్ : తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమీషన్ (టీఎస్ పిఎస్సి), పదో తరగతి ఇలా వరుసగా ప్రశ్నపత్రాల లీకవడం రాష్ట్రంలో కలకలం రేపుతోంది. ఈ క్వశ్చన్ పేపర్ల లీకేజీ వ్యవహారం రాజకీయ రంగు పులుముకుని అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్దానికి దారితీసింది. పేపర్ లీకులకు మీరంటే మీరే కారణమంటూ ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ప్రభుత్వమే కూలిపోయేంత పెద్ద వ్యవహారం ఈ పేపర్ల లీక్ అని బిఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.ఎస్ ప్రవీణ్ సంచలన వ్యాఖ్యలు చేసారు.

కేసీఆర్ ప్రభుత్వం ముందే అరకోరగా ఉద్యోగ నియామకాలు చేపడుతోందని... అవి కూడా ఇలా అవకతవకలతోనే సాగుతున్నాయని ప్రవీణ్ ఆరోపించారు. టీఎస్ పిఎస్సి గ్రూప్‌-1 టాపర్ ఎవరో బయటపెడితే కేసీఆర్ సర్కార్ కూలిపోవడం ఖాయమని అన్నారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ కు నిరుద్యోగుల పట్ల, నియామకాల పట్ల ఏమాత్రం చిత్తశుద్దివున్నా గ్రూప్-1 ప్రిలిమ్స్ టాపర్లను ప్రకటించాలని ఆర్.ఎస్ ప్రవీణ్ డిమాండ్ చేసారు. 

టీఎస్ పిఎస్సి బోర్డ్ సభ్యులంతా కల్వకుంట్ల కుటుంబం కేసీఆర్, కేటీఆర్, కవిత లకు తెలిసినవారేనని ప్రవీణ్ ఆరోపించారు. వీరి ద్వారా కేసీఆర్ ప్రభుత్వం అర్హులైన నిరుద్యోగులకు దక్కాల్సిన ఉద్యోగాలను పేపర్లు లీక్ చేసి రూ.10 లక్షల నుండి కోటి రూపాయల వరకు అమ్ముకుంటున్నాయని ప్రవీణ్ ఆరోపించారు. నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న ప్రస్తుత టీఎస్ పిఎస్సి బోర్డును వెంటనే రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేసారు. 

Read More టీఎస్ పీఎస్సీ లీక్ కేసు.. పరీక్ష రాసి, టెన్షన్ తో నిద్రలేని రాత్రులు.. దొరక్కూడదని దేవస్థానాలన్నీ తిరిగిన జంట

గ్రూప్‌-1 పరీక్షన్ నిర్వహించిన టీఎస్ పిఎస్సి సిబ్బందే పరీక్ష రాయడం ఏమిటని ప్రవీణ్ ప్రశ్నించారు. పేపర్ల లీకేజీ కేసులో నిందితులు రాజశేఖర్, దాసరి కిషోర్ కు గ్రూప్-1 ప్రిలిమ్స్ లో 150 మార్కులకు గాను 120 మార్కులు వచ్చాయని అన్నారు. ఇలా పేపర్ల లీక్ వ్యవహారంతో సంబంధాలున్న వారే గ్రూప్-1 ప్రిలిమ్స్ లో అధిక మార్కులు సాధించారని... నిజాయితీగా పరీక్ష రాసిన వారికి అన్యాయం జరిగిందన్నారు. 

టీఎస్ పిఎస్సి పేపర్ లీక్ వ్యవహారంపై ముఖ్యమంత్రి కేసీఆర్ మౌనంగా వున్నారంటే తప్పు జరిగిందని అంగీకరించడమేనని ప్రవీణ్ అన్నారు. కాబట్టి నైతిక బాధ్యత వహిస్తూ కేసీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నామని అన్నారు. ఒకవేళ తమ తప్పేమీ లేదని కేసీఆర్ భావిస్తే అమరవీరుల స్థూపం వద్ద చర్చకు రావాలని... తాము ఆధారాలతో సహా వస్తామని ప్రవీణ్ సవాల్ విసిరారు. 

టీఎస్ పిఎస్సి పేపర్ల లీకేజీ వ్యవహారంపై ప్రతిపక్షాలన్ని ఏకమై ప్రభుత్వంపై పోరాటం చేయాలని ప్రవీణ్ పిలుపునిచ్చారు. రాజకీయ పార్టీలు, ప్రజా, విద్యార్థి సంఘాలు, నిరుద్యోగులతో ఈ నెల 18న ఇందిరాపార్కు వద్ద నిరసన దీక్ష చేపట్టనున్నట్లు ప్రవీణ్ కుమార్ తెలిపారు. టీఎస్ పిఎస్సి పేపర్ లీక్ వెనకున్న పెద్దలెవరో బయటపెట్టాలని... ప్రస్తుత బోర్డును రద్దుచేసి కొత్త కమీషన్ ను ఏర్పాటు చేసాకే నియామకాలు కొనసాగించాలని ఆర్.ఎస్. ప్రవీణ్ డిమాండ్ చేసారు.