మూడెకరాల భూమి ఇస్తామని చెప్పి దళితులను సీఎం కేసీఆర్ మోసం చేశారని ఆరోపించారు బీఎస్పీ అధినేత్రి మాయావతి. తెలంగాణ ఎన్నికల్లో తమ పార్టీ సీఎం అభ్యర్ధిగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌ను ప్రకటించారు.
అతి త్వరలో తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అధికార బీఆర్ఎస్‌తో పాటు జాతీయ పార్టీలు కాంగ్రెస్, బీజేపీలు తమ వ్యూహాలు రచిస్తున్నాయి. అయితే తెలంగాణలోని కొన్ని నియోజకవర్గాల్లో పట్టున్న మరో జాతీయ పార్టీ బీఎస్పీ కూడా ఈసారి సత్తా చాటాలని భావిస్తోంది. ఇప్పటికే సీనియర్ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇక్కడ అధ్యక్షుడిగా వుండటంతో బీఎస్పీ ఆశలు పెట్టుకుంది. ఈ క్రమంలో ఎన్నికలకు సన్నాహకంగా బీఎస్పీ ఆదివారం హైదరాబాద్ సరూర్ నగర్ స్టేడియంలో ‘‘తెలంగాణ భరోసా సభ’’ నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీఎస్పీ అధినేత్రి మాయావతి హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆమె ప్రసంగిస్తూ.. తెలంగాణ ఎన్నికల్లో తమ పార్టీ సీఎం అభ్యర్ధిగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌ను ప్రకటించారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల కోసం మరిన్ని చట్టాలు తేవాలని అంబేద్కర్ భావించారని తెలిపారు. కానీ అప్పటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ ఏమాత్రం పట్టించుకోలేదన్నారు. మహాత్మా జ్యోతిబా పూలే, అంబేద్కర్, నారాయణ గురు చూపిన బాటలో పయనిద్దామని మాయావతి పిలుపునిచ్చారు. తమ పార్టీ కేవలం ఎస్సీల కోసమే కాకుండా సబ్బండ వర్గాల సంక్షేమం కోసం పనిచేస్తుందని మాయావతి స్పష్టం చేశారు. యూపీలో తమ హయాంలో ఎస్సీ, ఎస్టీ, బలహీనవర్గాల అభ్యున్నతికి ఎన్నో పథకాలు తీసుకొచ్చామని ఆమె గుర్తుచేశారు. తెలంగాణలో దళితులకు మూడెకరాల భూమి పంపిణీ చేస్తామని చెప్పి.. కేసీఆర్ మాట తప్పారని మాయావతి మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో పాగా వేయాలని ఆమె శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.
