KCR: హాస్పిటల్‌లో కేసీఆర్.. మరోవైపు BRSLP నేత ఎన్నిక.. గులాబీ ఎమ్మెల్యేల్లో ‘రివేంజ్’ ఆందోళన
శనివారం ఉదయం మూడో శాసన సభ తొలి అసెంబ్లీ సమావేశం మొదలుకానుంది. ఇంతకు ముందు బీఆర్ఎస్ తమ శాసనసభాపక్ష నేతను ఎన్నుకోనుంది. అయితే, బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ యశోద హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. మరోవైపు గులాబీ ఎమ్మెల్యేలో రివేంజ్ ఆందోళనలు ఉన్నట్టు సమాచారం.
హైదరాబాద్: శనివారం ఉదయం 11 గంటలకు మూడో శాసన సభ సమావేశం కావాలని గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ సమావేశాల్లో ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేస్తారు. ఇంతకు ముందు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రొటెం స్పీకర్‌గా ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీతో ప్రమాణం చేయిస్తారు. అయితే, ఈ సమావేశానికి ముందు మరో కీలక పరిణామం చోటుచేసుకోవాల్సి ఉన్నది. అదే ప్రతిపక్ష నేత ఎన్నిక.
39 సీట్లతో ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పార్టీ ఉన్నది. ఈ పార్టీ ఇంకా శాసనసభా పక్ష నేతను ఎన్నుకోలేదు. రేపు ఉదయం 9 గంటల ప్రాంతంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తెలంగాణ భవన్‌లో ఇందుకోసం సమావేశం కాబోతున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ సమావేశం నిర్వహిస్తారు. అనంతరం, వారు అసెంబ్లీకి వెళ్లుతారు.
అయితే, బీఆర్ఎస్ శాసనసభా పక్ష నేతగా ఎవరు ఎన్నిక అవుతారనేదానిపై ఇంకా ఉత్కంఠ కొనసాగుతున్నది. ఈ ఎన్నిక జరగనున్న సమయంలో పార్టీ అధినేత కేసీఆర్ యశోద హాస్పిటల్‌లో ఉన్నారు. ఆయన లేకుండానే ఈ సమావేశం జరగనుంది. కొన్ని విశ్వసనీయవర్గాల ప్రకారం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎల్పీ నేతగా కేసీఆరే ఉండాలని కోరుకుంటున్నట్టు తెలిసింది. సమావేశంలోనూ ఆయన్నే ఎన్నుకునే అవకాశాలు ఉన్నాయి.
Also Read: Potato: పొటాటో అంటే ఉల్లిగడ్డలే కదా!.. సీఎం జగన్ వ్యాఖ్యలు వైరల్.. ‘అది రాయలసీమ యాస’
గతంలో ప్రతిపక్షంలో ఉన్న రేవంత్ రెడ్డికి, కేసీఆర్‌కు మధ్య హీట్ టాక్ జరిగింది. రేవంత్ రెడ్డిని అసెంబ్లీ నుంచి బహిష్కరించిన సందర్భాలు ఉన్నాయి. దీంతో కాంగ్రెస్ కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై రివేంజ్ తీసుకునే అవకాశాలు ఉన్నాయని గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు ఆందోళన చెందుతున్నట్టు తెలుస్తున్నది. అందుకోసమే.. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దీటుగా ఎదుర్కొనేందుకు తమ అధినాయకుడు కేసీఆరే శాసనసభా పక్ష నేతగా ఉండాలని వారు కోరుకుంటున్నారు. తమ పై మరే రూపంలోనూ రివేంజ్ తీసుకునే ప్రయత్నాలనూ కేసీఆర్ అడ్డుకోగలరని విశ్వసిస్తున్నారు.
Also Read: Telangana Movement: రేవంత్ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం.. ఉద్యమ కేసులపై ఆదేశాలు
బీఆర్ఎస్ఎల్పీ నేతగా కేసీఆర్ ఆసక్తి చూపడం లేదని, ఆయన స్థానం లో కేటీఆర్ లేదా హరీశ్ రావును ఎన్నుకునే అవకాశాలు ఉన్నాయని ఇది వరకే చర్చలు వచ్చాయి. అంతే కాదు, ఒక వేళ వీరిద్దరూ కాదన్న పక్షంలో స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిని ఎన్నుకుంటారనీ వాదనలు వచ్చాయి. ఈ సస్పెన్స్‌కు శనివారం ఉదయం తెలంగాణ భవన్ లో తెర పడనుంది.