తెలంగాణ బ్రదర్స్ ఆండ్ సిస్టర్స్ ... తస్మాత్ జాగ్రత్త..! : కేటీఆర్ హెచ్చరిక
ప్రభుత్వ కార్యాలయాల్లో సేఫ్ గా వుండాల్సిన ప్రజాపాలన దరఖాస్తులు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్లడంపై మాజీ ఐటీ మంత్రి కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేసారు.
హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం ఆరు గ్యారంటీల అమలుకు సిద్దమై అర్హులనుండి దరఖాస్తులను స్వీకరించేందుకు ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించింది... అదే 'ప్రజాపాలన'. అభయహస్తం పేరిట కోట్లాది తెలంగాణ ప్రజల వివరాలను రేవంత్ సర్కార్ సేకరించింది. అయితే సున్నితమైన ఈ సమాచారం సైబర్ నేరగాళ్ల చేతుల్లోకి వెళుతోందన్న ప్రచారం ఇప్పుడు ప్రజలను కలవరపెడుతోంది. ఇటీవల కొందరు ప్రైవేట్ వ్యక్తులు ప్రజాపాలన దరఖాస్తులను తీసుకువెళుతున్న ఘటనలు వరుసగా వెలుగుచూస్తున్నాయి. తాజాగా హైదరాబాద్ బాలానగర్ లో ఓ వ్యక్తి ప్రజాపాలన దరఖాస్తులను తీసుకువెళుతూ ప్రజలకంటపడ్డాడు. దీంతో తెలంగాణ ప్రజలనుండి ప్రభుత్వం సేకరించిన సమాచారం సేఫ్ కాదా? ఇది సైబర్ నేరగాళ్ల చేతుల్లోకి వెళుతుందా? అనే అనుమానాలు మొదలయ్యాయి. మాజీ ఐటీ మంత్రి, బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఇదే అనుమానం వ్యక్తం చేసారు.
ప్రభుత్వ కార్యాలయాల్లో సేఫ్ గా వుండాల్సిన ప్రజాపాలన దరఖాస్తులను కొందరు ప్రైవేట్ వ్యక్తులు తరలిస్తున్న వీడియోలు తనదృష్టికి కూడా వచ్చినట్లు కేటీఆర్ తెలిపారు. కోట్లాది తెలంగాణ ప్రజల సున్నితమైన ఢాటా బయటి వ్యక్తుల చేతుల్లో పడటం ప్రమాదకరమని అన్నారు. కాబట్టి వెంటనే ప్రభుత్వం ప్రజాపాలన దరఖాస్తులు బయటకు వెళ్లకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వ పథకాల కోసం ప్రజల ఇచ్చిన సున్నిత సమాచారం సైబర్ నేరగాళ్ళ చేతుల్లోకి వెళ్లకుండా చూడాలని కేటీఆర్ సూచించారు.
అలాగే తెలంగాణ ప్రజలు కూడా సైబర్ నేరగాళ్లతో జాగ్రత్తగా వుండాలని కేటీఆర్ సూచించారు. సైబర్ నేరగాళ్లు పెన్షన్లు, ఇండ్లు వంటి ఆరు గ్యారంటీ పథకాలను ఇప్పిస్తామంటూ ప్రజలను మోసం చేయవచ్చని మాజీ మంత్రి ఆందోళన వ్యక్తం చేసారు. కాబట్టి ప్రభుత్వ పథకాలు ఇప్పిస్తాం... మీ బ్యాంక్ వివరాలు చెప్పండి, ఫోన్ కు వచ్చే ఓటిపి చెప్పాలని అడిగితే నమ్మి మోసపోవద్దని... ఎలాంటి వివరాలు ఇవ్వొద్దని సూచించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాటలు నమ్మి అనవసరంగా డబ్బులు పోగొట్టుకోవద్దని కేటీఆర్ హెచ్చరించారు.
Also Read రోడ్డుపై దర్శనమిచ్చిన ప్రజా పాలన దరఖాస్తులు.. సోషల్ మీడియాలో వీడియోలు వైరల్
బిఆర్ఎస్ పార్టీకి ఓటు వేసారా లేదా అన్నది అనవసరం... తన మాటలను మాత్రం ప్రతిఒక్కరు సీరియస్ గా తీసుకోవాలని కేటీఆర్ కోరారు. సైబర్ క్రైమ్ చట్టాల రూపకల్పనలో పాలుపంచుకున్న వ్యక్తిగా చెబుతున్నా... సైబర్ నేరగాళ్ల బారిన పడవద్దని మాజీ ఐటీ మంత్రి కేటీఆర్ సూచించారు.