తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు : ఉమ్మడి వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్ దూకుడు, ప్రతి మూలలోనూ ప్రచారం కంప్లీట్
ఉమ్మడి వరంగల్ జిల్లాలోనూ ప్రచారం విషయంలో బీఆర్ఎస్ అభ్యర్ధులు పైచేయి సాధించారు. దీనిపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ.. తమ అభ్యర్ధులు ప్రచారంలో నిమగ్నమై వున్నారని పేర్కొన్నారు. ఇప్పటికే వరంగల్ జిల్లాలోని దాదాపు ప్రతి మూలకు వెళ్లామని మంత్రి చెప్పారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ పార్టీ దూసుకెళ్తోంది. అందరికంటే అభ్యర్ధులను ప్రకటించడంతో దొరికిన వెసులుబాటుతో ఇప్పటికే తొలి రౌండ్ ప్రచారాన్ని బీఆర్ఎస్ నేతలు పూర్తి చేశారు. ఇక సీఎం కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావులతో పాటు మంత్రులు, ఇతర కీలక నేతలు ప్రచార బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. కేసీఆర్ రోజుకు రెండు , మూడు సభల్లో పాల్గొంటూ వుండటంతో పార్టీ శ్రేణుల్లో జోష్ నెలకొంది.
ఉమ్మడి వరంగల్ జిల్లాలోనూ ప్రచారం విషయంలో బీఆర్ఎస్ అభ్యర్ధులు పైచేయి సాధించారు. దీనిపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ.. తమ అభ్యర్ధులు ప్రచారంలో నిమగ్నమై వున్నారని పేర్కొన్నారు. ఇప్పటికే వరంగల్ జిల్లాలోని దాదాపు ప్రతి మూలకు వెళ్లామని మంత్రి చెప్పారు. శుక్రవారం వర్ధన్నపేట, మహబూబాబాద్ నియోజకవర్గాల్లో జరిగే బహిరంగ సభల్లో స్వయంగా కేసీఆర్ పాల్గొంటారని ఎర్రబెల్లి వెల్లడించారు.
Also Read: రాష్ట్రంలో ఫ్లోరైడ్ సమస్యను బీఆర్‌ఎస్ మాత్రమే పరిష్కరించింది.. : సీఎం కేసీఆర్
ఇకపోతే.. రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు జరిగిన తీరును ప్రజలకు వివరించడం ద్వారా మరోసారి అధికారాన్ని అందుకోవాలని బీఆర్ఎస్ ప్రయత్నిస్తోంది. దీనికి తోడు ప్రత్యర్ధుల కంటే ముందే అభ్యర్ధులను ప్రకటించడంతో వారికి ప్రచారానికి వీలు కలిగింది. అభ్యర్ధిత్వం ఖరారైన నాటి నుంచి సమగ్ర ప్రచారాన్ని ప్రారంభించేందుకు బీఆర్ఎస్ నేతలకు అవకాశం దొరికింది. దీనికి తోడు నియోజకవర్గ స్థాయి సన్నాహక సమావేశాలు, మండల స్థాయి సమావేశాలు, గ్రామీణ ప్రాంతాలు, పట్టణ ప్రాంతాల్లో నిర్దిష్ట కార్యకలాపాలు, కొన్ని విభాగాలలో ఇంటింటికీ ప్రచారం కూడా ఇందులో వున్నాయి. అలాగే అక్టోబర్ 15న విడుదల చేసిన పార్టీ మేనిఫెస్టో .. బీఆర్ఎస్ ఎన్నికల వ్యూహానికి కేంద్ర బిందువుగా మారింది.
ఇకపోతే.. కాజీపేట సమీపంలోని భట్టుపల్లి గ్రామంలో ముఖ్యమంత్రి సభ ఏర్పాట్లను వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ , వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాసం వినయ్ భాస్కర్‌లతో కలిసి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పరిశీలించారు. 44వ డివిజన్ పరిధిలో దాదాపు లక్షమంది ఈ సభకు హాజరవుతారని అంచనా.