Asianet News TeluguAsianet News Telugu

త్వరలోనే మంచిరోజులు వస్తాయన్నారు... ఇంతలోనే ఇలా : కేసీఆర్ గాయంపై బిఆర్ఎస్ శ్రేణులు ఆవేదన

బిఆర్ఎస్ ఓటమితో బాధపడుతున్న తమకు ధైర్యం చెప్పిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గాయంతో హాస్పిటల్లో చేరినట్లు తెలిసి ఆ పార్టీ శ్రేణులు ఆందోళనకు గురవుతున్నారు.    

BRS Supporter reacts on ex CM K Chandrashekar Rao hospitalised with Injury AKP
Author
First Published Dec 8, 2023, 11:34 AM IST

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్ఎస్ ఓటమిపాలై అధికారాన్ని కోల్పోయింది. స్వరాష్ట్ర ఏర్పాటు తర్వాత వరుసగా రెండుసార్లు అధికారాన్ని కైవసం చేసుకున్న బిఆర్ఎస్ కు హ్యాట్రిక్ కల మాత్రం నెరవేరలేదు. దీంతో ఆ పార్టీ శ్రేణుల్లో తీవ్ర నిరాశ, నిస్పృహ ఏర్పడింది. ఇలా ఆత్మస్థైర్యాన్ని కోల్పోయిన పార్టీ నాయకులు, కార్యకర్తల్లో ధైర్యం నింపేందుకు బిఆర్ఎస్ అదినేత కేసీఆర్ ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా గత రెండుమూడు రోజులుగా బిఆర్ఎస్ నాయకులతో పాటు సామాన్య కార్యకర్తలతోనూ మమేకం అవుతున్నారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. 

గురువారం కూడా వివిధ జిల్లాల నుండి వచ్చిన నాయకులు, ప్రజలు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిసారు. ఎర్రవల్లి ఫార్మ్ హౌస్ కు చేరుకున్న మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు, బిఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు, ఉద్యోగ సంఘాల నేతలు, మేధావులు, కవులు, కళాకారులు, మహిళలు, యువకులతో కేసీఆర్ ముచ్చటించారు. ఈ క్రమంలో పార్టీ నాయకులతో రాజకీయ వ్యవహారాల సీరియస్ గా, సామాన్య ప్రజలతో సరదాగా ముచ్చటించారు కేసీఆర్.  

అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిని మరిచిపోలేకపోతున్న కొందరు నాయకులు కేసీఆర్ ముందు తమ బాధను బయటపెట్టుకున్నారు. దీంతో వారిని ఓదారుస్తూ... ఇప్పుడు సమయం బాగాలేకపోవచ్చు... కానీ త్వరలోనే మంచిరోజులు వస్తాయంటూ ధైర్యం చెప్పారు. పార్టీ ఓటమిని చూసి ఎవ్వరూ అధైర్యపడవద్దని... ఇప్పటికీ రాజకీయంగా బిఆర్ఎస్ బలంగానే వుందని అన్నారు. త్వరలోనే భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకుని ప్రజల్లోకి వెళదామని పార్టీ శ్రేణులకు కేసీఆర్ సూచించారు. 

 

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ అద్భుతంగా పనిచేసారని... గెలుపుకోసం అన్నిరకాల ప్రయత్నాలు చేసినా సాధ్యం కాలేదని కేసీఆర్ పేర్కొన్నారు. విజయం దక్కనంత మాత్రాన సరిగ్గా పనిచేయనట్లు కాదని... ఒక్కోసారి ఏం చేసినా ఫలితం దక్కదన్నారు. బిఆర్ఎస్ గెలుపు కోసం పనిచేసిన నాయకులు, కార్యకర్తలకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నారు... ఇకపైనా పార్టీ బలోపేతం కోసం పనిచేయాలని కేసీఆర్ సూచించారు.  

Read More  కేసీఆర్ కు గాయం.. త్వరగా కోలుకోవాలన్న ప్రధాని మోడీ..

ఇలా పార్టీ శ్రేణుల్లో ధైర్యం నింపిన మర్నాడే కేసీఆర్ ప్రమాదానికి గురయ్యారు. ఎర్రవల్లి ఫాంహౌస్ లో తెల్లవారుజామున 2 గంటల సమయంలో కేసీఆర్ కాలుజారి పడిపోయారు. పంచె కాళ్లకు తగులుకుని కేసీఆర్ కిందపడిపోయినట్లు తెలుస్తోంది. దీంతో వెంటనే ఆయనను హైదరాబాద్ యశోదా హాస్పిటల్ కు తరలించారు. కేసీఆర్ ను పరీక్షించిన డాక్టర్లు చికిత్స అందిస్తున్నారు. 

కేసీఆర్ ఎడమకాలికి ప్రాక్చర్ అయినట్లు తెలుస్తోంది. విషయం తెలియగానే వెంటనే కేటీఆర్, కవితలతో సహా కుటుంబ సభ్యులు ఆస్పత్రికి చేరుకున్నారు. అలాగే కేసీఆర్ కు గాయమైనట్లు తెలిసి బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఆందోళనకు గురవుతున్నారు. గురువారం సీఎంను కలిసినవారయితే తమను ఎంతో ఆప్యాయంగా పలకరించి... ధైర్యం చెప్పిన అధినేతకు ఇలా జరగడం ఎంతో బాధాకరమని అంటున్నారు. ఈ గాయం నుండి కేసీఆర్ త్వరగా కోలుకోవాలని బిఆర్ఎస్ శ్రేణులు, అభిమానించేవారు కోరుకుంటున్నారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios