భారత రాష్ట్ర సమితి పార్టీకిి మరో సిట్టింగ్ ఎమ్మెల్యే షాక్ ఇవ్వనున్నట్లు కనిపిస్తోంది. ఇవాళ ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డితో సమావేశమయ్యారు.
హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించి నియోజకవర్గ స్థాయిలో ప్రచారం కూడా ప్రారంభించింది అధికార బిఆర్ఎస్ పార్టీ. కానీ టికెట్ ఆశించి భంగపడ్డ నాయకులు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతుండటం బిఆర్ఎస్ ను కలవరపెడుతోంది. చివరకు సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సైతం బిఆర్ఎస్ కు షాక్ ఇస్తున్నారు. ఇప్పటికే తుమ్మల నాగేశ్వరరావు, మైనంపల్లి హన్మంతరావు, వేముల వీరేశం వంటి సీనియర్లు ఇప్పటికే బిఆర్ఎస్ కు రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరారు. తాజాగా ఓ సిట్టింగ్ ఎమ్మెల్సీ సైతం బిఆర్ఎస్ ను వీడేందుకు సిద్దమయ్యారు.
బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో సమావేశమయ్యారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని రేవంత్ ఇంట్లోనే వీరిద్దరూ భేటీ అయ్యారు. ఇప్పటికే కాంగ్రెస్ లో చేరాలని నిర్ణయించుకున్న కసిరెడ్డి రేవంత్ తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. పార్టీలో చేరిక, టికెట్ హామీపై మరోసారి క్లారిటీ తీసుకునేందుకే కసిరెడ్డి రేవంత్ తో భేటీ అయినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఆయన బిఆర్ఎస్ ను వీడటం ఖాయంగా కనిపిస్తోంది.
ఇదిలావుంటే రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి నుండి పోటీచేయాలని కసిరెడ్డి నారాయణరెడ్డి భావిస్తున్నారు. ఇందుకోసం బిఆర్ఎస్ పార్టీలో ప్రయత్నించి భంగపడ్డారు. కొన్ని స్థానాల్లో మినహా అన్నిచోట్లా సిట్టింగ్ లనే మళ్లీ బరిలోకి దింపాలని బిఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ నిర్ణయించారు. దీంతో నారాయణరెడ్డికి కాకుండా తిరిగి సిట్టింగ్ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ కే కల్వకుర్తి టికెట్ దక్కింది. దీంతో తీవ్ర అసంతృప్తికి గురయిన ఎమ్మెల్సీ బిఆర్ఎస్ పార్టీని వీడడానికి సిద్దమయ్యారు.
Read More Revanth Reddy: 'ఆ ఆరు గ్యారంటీలను చూసి తండ్రికి చలి జ్వరం వస్తే.. కొడుక్కేమో మతి పోయింది'
ఇప్పటికే కాంగ్రెస్ నేతలతో పలుమార్లు చర్చలు జరిపిన ఎమ్మెల్సీ కసిరెడ్డి ఇవాళ టిపిసిసి చీఫ్ రేవంత్ తో భేటీ అయ్యారు. త్వరలోనే కాంగ్రెస్ లో చేరడానికి సిద్దమైన కసిరెడ్డి అందుకోసం చర్చించేందుకే రేవంత్ ను కలిసినట్లు తెలుస్తోంది. భారీగా అనుచరులు, వెంటవచ్చే నాయకులతో కలిసి కసిరెడ్డి కాంగ్రెస్ కండువా కప్పుకోడానికి సిద్దమయ్యారు. కాంగ్రెస్ జాతీయ నాయకులు లేదంటే రేవంత్ రెడ్డి సమక్షంలోని కాంగ్రెస్ చేరనున్నట్లు సమాచారం.
ఇటీవలే తన సన్నిహితులు,అనుచరులు, కల్వకుర్తికి చెందిన నాయకులతో ఎమ్మెల్సీ కసిరెడ్డి భేటీ అయ్యారు. తన రాజకీయ భవిష్యత్ గురించి చర్చించిన ఆయన కాంగ్రెస్ లో చేరితే ఎలా వుంటుందని చర్చించారు. బిఆర్ఎస్ లో టికెట్ దక్కలేదు కాబట్టి కాంగ్రెస్ అవకాశమిస్తే పార్టీ మారాలని వారు సూచించారట. అనంతరం కాంగ్రెస్ నాయకుల నుండి సానుకూల స్పందన రావడంతో బ్రిలియంట్ విద్యాసంస్థల అధినేత కసిరెడ్డి నారాయణరెడ్డి బిఆర్ఎస్ ను వీడుతున్నట్లు తెలుస్తోంది.
పార్టీలోకి నాయకుల వలస పెరగడంతో కాంగ్రెస్ పార్టీ జోరుమీద వుండగా బిఆర్ఎస్, బిజెపి లు బేజారు అవుతున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.ఓ సమయంలో బిఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం బిజెపియే అనే పరిస్థితి వుండగా... ఎన్నికల వేళ ఆ పార్టీ పూర్తిగా డీలాపడిపోయింది. అధ్యక్ష పదవినుండి బండి సంజయ్ తొలగింపు తర్వాత బిజెపి జోరుతగ్గి కాంగ్రెస్ ఊపు పెరిగింది. అయితే ఈ ఊపు ఎక్కడా తగ్గకుండా ఎన్నికల వరకు కొనసాగించాలని కాంగ్రెస్ భావిస్తోంది. అందుకోసమే సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీలతో వరుసగా సభలు ఏర్పాటుచేస్తూ నాయకులు, కార్యకర్తల్లో జోష్ నింపుతున్నారు.
ఇక అందరికంటే ముందే అభ్యర్థులను ప్రకటించడం అధికార బిఆర్ఎస్ కు కొంచెం ప్లస్, మరికొంత మైనస్ అయ్యింది. టికెట్ దక్కిన నాయకులు ప్రజల్లోకి వెళ్లడానికి చాలా సమయం దొరికితే... టికెట్ దక్కని నాయకులకు కూడా ఇతర పార్టీలో సంప్రదింపులు జరిపేందుకు అంతే సమయం దొరికింది. ఇలా అసంతృప్త నేతలు ఒక్కోకరుగా కాంగ్రెస్ గూటికి చేరుకుతున్నారు. కొందరు నాయకులను మాత్రం పార్టీ వీడకుండా చూడటంలో బిఆర్ఎస్ సక్సెస్ అయ్యింది.
