సారాంశం
Revanth Reddy: కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 హామీలను చూసి తండ్రికి (సీఎం కేసీఆర్) చలిజ్వరం వస్తే, కొడుక్కేమో ( మంత్రి కేటీఆర్) పూర్తిగా మతి తప్పినట్టుగా ఉందని రేవంత్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
Revanth Reddy: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాజకీయం వేడెక్కుతోంది. ఈ క్రమంలో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్దం జరుగుతోంది. తాజాగా పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారంటీలను చూసి తండ్రికి చలి జ్వరం పట్టుకుంటే.. ఆయన కొడుకు మంత్రి కేటీఆర్ అయితే .. పూర్తిగా మతి తప్పినట్టుగా మాట్లాడుతున్నారని రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు.
తెలంగాణలో ఎన్నికలకు నిధుల కోసం కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త ట్యాక్స్ వేస్తూ.. భారీ మొత్తంలో వసూలు చేస్తోందని మంత్రి కేటీఆర్ ఆరోపించారు. మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తీవ్రంగా ఖండిస్తూ.. అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు.
బీఆర్ఎస్ పాలన అవినీతిలో మునిగి, నిద్రలో కూడా కమీషన్ల గురించే కలవరించే మీరా కాంగ్రెస్ గురించి మాట్లాడేది? అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. పక్క రాష్ట్రం(కర్నాటక)పై గాలి మాటలను కాసేపు పక్కనబెట్టి, తెలంగాణలో మీ కల్వకుంట్ల SCAMILY గురించి చెప్పు అని ఎద్దేవా చేశారు.
దళిత బంధులో 30 శాతం కమీషన్లు దండుకుంటున్నమని స్వయంగా కేసీఆర్ ఒప్పుకున్న సంగతి గురించి చెప్పు.. మట్లాడాలని అన్నారు. లిక్కర్ స్కామ్ లో కల్వకుంట్ల కవిత రూ.300 కోట్లు వెనకేసిందని దేశమంతా చెప్పుకుంటున్న మాటల గురించి చెప్పు.. భూములు, లిక్కర్ అమ్మితే తప్ప తెలంగాణలో పాలన నడుస్తలేదని కాగ్ కడిగేసిన విషయం గురించి చెప్పు.. అంటూ రేవంత్ రెడ్డి చురకలంటించారు.
అలాగే.. తెలంగాణలో ఎన్ని ప్రభుత్వ భూములను అమ్ముకున్నరో..? ఎన్నిఎకరాలను మీ రియల్ ఎస్టేట్ మాఫియాకు కట్టబెట్టిండ్రో ..? ఎంత మంది మీ బినామీ బిల్డర్లతో హైదరాబాద్ మాఫియా సామ్రాజ్యాన్ని నడిపిస్తున్నరో..? ఎన్ని లక్షల చ.అడుగుల స్థలాలు మీ మాఫియా కబంధ హస్తాల్లో చిక్కుకున్నయో..? అన్నీ లెక్కలతో సహా తేలుస్తామనీ, తెలంగాణలో కాంగ్రెస్ ను అడ్డుకోవడం నీ వల్ల కాదు.. కేసీఆర్ వల్ల కూడా కాదని ఘాటుగా స్పందించారు రేవంత్.
ఇంతకీ ఏం జరిగింది?
మంత్రి కేటీఆర్ .. ప్రతిపక్ష కాంగ్రెస్ పై విమర్శలు గుప్పిస్తూ.. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీకి నిధులు ఇవ్వడానికి "రాజకీయ ఎన్నికల పన్ను" విధించడం ప్రారంభించిందని మంత్రి కేటీఆర్ ఆరోపించారు. ఈ మేరకు బెంగళూరులో బిల్డర్లకు చదరపు అడుగుకి రూ 500 చొప్పున పన్ను వసూలు చేస్తున్నారని అన్నారు.
కాంగ్రెస్ తన పాత అవాటు ఎన్నటికీ మార్చుకోదనీ, గ్రాండ్ ఓల్డ్ పార్టీ తన స్కామ్ ల వారసత్వాన్ని కొనసాగిస్తుందని అన్నారు. అందుకే .. కాంగ్రెస్ పార్టీని స్కామ్‌గ్రెస్ అని పిలుస్తారంటూ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. ఎన్నికల కోసం ఎంత డబ్బు ముట్టజెప్పినా.. తెలంగాణ ప్రజలను ఎవరూ మోసం చేయలేరనీ, స్కామ్‌గ్రెస్ కు తిప్పికొట్టాలని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ఈ పోస్ట్ వైరల్ కావడంతో వివాదం మొదలైంది.