మరో ఇద్దరు అభ్యర్థులను ప్రకటించిన బీఆర్ఎస్
బీఆర్ఎస్ మరో ఇద్దరు అభ్యర్థులను ప్రకటించింది. వరంగల్ నుంచి కడియం కావ్య, చేవెళ్ల నుంచి కాసాని జ్ఞానేశ్వర్‌లను అభ్యర్థులుగా వెల్లడించింది.
ఇది వరకే నలుగురు అభ్యర్థులను ప్రకటించిన బీఆర్ఎస్.. తాజాగా మరో ఇద్దరి పేర్లను ప్రకటించింది. చేవెళ్ల బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా కాసాని జ్ఞానేశ్వర్ పేరును బీఆర్ఎస్ ప్రకటించింది. అలాగే.. వరంగల్ లోక్ సభ స్థానానికి డాక్టర్ కడియం కావ్య పేరును అభ్యర్థిగా ఖరారు చేసింది. కేసీఆర్ వరంగల్ లోక్ సభ పరిధిలోని ముఖ్య నాయకులతో భేటీ అయ్యారు.
బీఆర్ఎస్ ఇప్పటికే నలుగురు అభ్యర్థులను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఖమ్మం నుంచి ఎంపీ నామా నాగేశ్వరరావు, మహబూబాబాద్ నుంచి మాలోత్ కవిత, కరీంనగర్ నుంచి బోయినపల్లి వినోద్ కుమార్, పెద్దపల్లి నుంచి కొప్పుల ఈశ్వర్‌లను అభ్యర్థులుగా ప్రకటించిన సంగతి తెలిసిందే.
కాసాని జ్ఞానేశ్వర్ ఎన్నికలకు ముందటి వరకు టీడీపీ తెలంగాణ అధ్యక్షుడిగా బాధ్యతల్లో ఉన్నారు. కానీ, చంద్రబాబు నాయుడు జైలుకు వెళ్లిన సందర్భంలో తెలంగాణలో పోటీకి సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణలో టీడీపీ పోటీ చేయవద్దంటూ చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయాన్ని కాసాని వ్యతిరేకించారు. ఇన్నాళ్లు ఎన్నికల కోసం ఎదురుచూశామని, ఇప్పుడు పోటీ వద్దంటూ నిర్ణయం తీసుకోవడం ఏమిటంటూ టీడీపీ క్యాడర్ కూడా భగ్గుమంది. ఆ తర్వాత కాసాని జ్ఞానేశ్వర్ కేసీఆర్‌ను ఫామ్ హౌజ్‌కు వెళ్లి కలిశారు. బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు.
బీఆర్ఎస్‌లో కీలకమైన ముదిరాజ్ నాయకుడు వచ్చాడంటూ కేసీఆర్ కాసానిని ఉద్దేశించి కామెంట్ చేశాడు. గజ్వేల్‌లో అప్పుడు పోటీ చేసిన ఈటల రాజేందర్ తనను తాను బలమైన ముదిరాజ్ నాయకుడిగా ప్రొజెక్ట్ చేసుకున్నారు. ఇందుకు కౌంటర్‌గా కేసీఆర్ కాసానిని కేసీఆర్ ప్రెజెంట్ చేశారు.