విపక్ష కూటమి భేటీకి వెళ్లకపోతే బీజేపీతో ఉన్నట్టా?: కేశవరావు
ప్రజల అవసరాలకు అనుగుణంగా తమ పార్టీ నిర్ణయాలుంటాయని బీఆర్ఎస్ పార్టీ ఎంపీ కేశవరావు చెప్పారు. విపక్ష కూటమి సమావేశంపై కేశవరావు స్పందించారు.
న్యూఢిల్లీ:విపక్ష కూటమి సమావేశానికి వెళ్లలేదంటే బీజేపీతో ఉన్నట్టా అని బీఆర్ఎస్ ఎంపీ కె. కేశవరావు ప్రశ్నించారు. న్యూఢిల్లీలో బుధవారం నాడు కేశవరావు మీడియాతో మాట్లాడారు. సిద్దాంతపరంగా ఎవరూ ఎటు ఉన్నారో చూడాలని ఆయన కోరారు. కూటముల్లో ఎన్ని పార్టీలున్నాయనేది ప్రధానం కాదన్నారు.రాజకీయాల్లో అర్థ గణాంకాలు పని చేయవని కేశవరావు తెలిపారు. తమ పార్టీ ప్రజల అవసరాల ప్రాతిపదికగా వెళ్తున్నట్టుగా కేశవరావు వివరించారు.
బెంగుళూరులో నిర్వహించిన విపక్ష పార్టీల సమావేశానికి బీఆర్ఎస్ కు ఆహ్వానం రాలేదు. దీంతో ఈ సమావేశానికి ఆ పార్టీ హాజరు కాలేదు. మరో వైపు బీజేపీకి కూడ బీఆర్ఎస్ దూరంగా ఉంది. ఎన్డీఏ, విపక్ష కూటముల సమావేశాలకు బీఆర్ఎస్ దూరంగానే ఉంది. ఈ పరిణామాల నేపథ్యంలో బీఆర్ఎస్ పై కొందరు నేతలు విమర్శలు చేశారు. బీఆర్ఎస్ ను బీజేపీ బీ టీమ్ గా కాంగ్రెస్ విమర్శలు చేస్తుంది. ఇటీవల ఖమ్మంలో నిర్వహించిన కాంగ్రెస్ సభలో రాహుల్ గాంధీ ఈ విషయాన్ని స్వయంగా ప్రకటించారు.అందుకే విపక్ష పార్టీల సమావేశానికి బీఆర్ఎస్ ను ఆహ్వానించలేదని కూడ ఆయన స్పష్టం చేశారు.
వచ్చే ఎన్నికల్లో దేశంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రాకుండా కీలక పాత్ర పోషిస్తామని కేసీఆర్ ప్రకటించారు.ఈ మేరకు పలు విపక్ష పార్టీల నేతలు, సీఎంలతో ఆయన సమావేశాలు నిర్వహించారు. అయితే కేసీఆర్ గతంలో సమావేశమైన నేతలు, సీఎంలు బెంగుళూరులో నిర్వహించిన విపక్ష పార్టీల సమావేశానికి హాజరయ్యారు. బీజేపీకి వ్యతిరేకంగా విపక్ష పార్టీలు ఏకమయ్యాయి.