ఆ ఎమ్మెల్యేలను ప్రజలు తిరస్కరిస్తారు.. తాండూరులో విజయం నాదే: ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి సంచలనం

మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ గుర్తు పైన గెలిచి మరో పార్టీలోకి చేరిన ఎమ్మెల్యేలను రాష్ట్ర ప్రజలు వచ్చే ఎన్నికల్లో తిరస్కరిస్తారని అన్నారు.

brs mlc patnam mahender reddy sensational comments ksm

హైదరాబాద్: మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ గుర్తు పైన గెలిచి మరో పార్టీలోకి చేరిన ఎమ్మెల్యేలను రాష్ట్ర ప్రజలు వచ్చే ఎన్నికల్లో తిరస్కరిస్తారని అన్నారు. కర్ణాటకలో అదే జరిగిందని.. తెలంగాణలో కూడా అదే జరగబోతుందని జోస్యం చెప్పారు. పట్నం మహేందర్ రెడ్డి బుధవారం తాండూరులో మీడియాతో మాట్లాడుతూ.. తాను కారు గుర్తు పైనే గెలిచానని.. వేరే పార్టీలో గెలిచి బీఆర్ఎస్‌లోకి రాలేదన్నారు. వచ్చే ఎన్నికల్లో తాండూరు బీఆర్ఎస్ అభ్యర్థిగా తానే పోటీచేసి విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు. అన్ని సర్వేలు తనకు అనుకూలంగా ఉన్నాయని చెప్పారు. 

2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఒక పార్టీ గుర్తుపై గెలిచిన కొందరు మరో పార్టీలో చేరడంపై ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. ఈ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ అధిష్టానం వివరణ కోరిన ఉన్న విషయమే మాట్లాడానని చెబుతానని అన్నారు. తాండూరులో తన క్యాడర్ చెక్కు చెదరలేదని అన్నారు. తాను గతంలో నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందానని చెప్పారు. నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ది చేశానని తెలిపారు. 

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలలో పాల్గొని విజయవంతం చేస్తామని మహేందర్ రెడ్డి పేర్కొన్నారు. జూన్ 21 నుంచి ప్రజా క్షేత్రంలోకి వెళ్లేలా పల్లెపల్లెకూ పట్నం కార్యక్రమాన్ని చేపడతానని తెలిపారు. 

ఇదిలా ఉంటే.. తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డిల మధ్య విభేదాలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి బరిలో నిలిచిన రోహిత్ రెడ్డి.. టీఆర్‌ఎస్ నుంచి పోటీ చేసిన మహేందర్ రెడ్డి‌పై విజయం సాధించారు. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో రోహిత్ రెడ్డి గులాబీ కండువా కప్పుకున్నారు. ఆ తర్వాత నుంచి ఇరువురు నేతల మధ్య పలు సందర్బాల్లో బహిరంగంగానే విభేదాలు వెలుగుచూసిన సంగతి తెలిసిందే. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios