మోతిలాల్ నుంచి రాజీవ్ వరకు ప్రస్తావిస్తూ.. మీది కుటుంబ పాలన కాదా , ప్రియాంకా గాంధీపై కల్వకుంట్ల కవిత సెటైర్లు

కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు బీఆర్ఎస్ పార్టీపై చేసిన వ్యాఖ్యలకు ఎమ్మెల్సీ కల్వకుంట కవిత కౌంటరిచ్చారు . మాట్లాడే ముందు స్క్రిప్ట్‌ను సరిచూసుకోవాలంటూ సెటైర్లు వేశారు. 

brs mlc kalvakuntla kavitha slams congress leader priyanka gandhi ksp

అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలో రాజకీయాలు వేడెక్కాయి. అగ్రనేతల పర్యటనలు వారి విమర్శలు , ప్రతి విమర్శలతో ప్రచారం జోరందుకుంది. కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు బీఆర్ఎస్ పార్టీపై చేసిన వ్యాఖ్యలకు ఎమ్మెల్సీ కల్వకుంట కవిత కౌంటరిచ్చారు. ప్రియాంకా గాంధీ కుటుంబ రాజకీయాల గురించి మాట్లాడటం విడ్డూరంగా వుందన్నారు. మోతీలాల్ నెహ్రూ కొడుకు జవహర్‌ లాల్ నెహ్రూ, నెహ్రూ కూతురు ఇందిరా గాంధీ, ఇందిర కుమారుడు రాజీవ్ గాంధీ, రాజీవ్ గాంధీ కూతురు ప్రియాంక గాంధీ అంటూ కవిత దుయ్యబట్టారు. ఇది కుటుంబ పాలన కాదా.. మాట్లాడే ముందు స్క్రిప్ట్‌ను సరిచూసుకోవాలంటూ సెటైర్లు వేశారు. 

మిషన్ భగీరథ, కాళేశ్వరం ప్రాజెక్ట్‌ల రెండింటి ఖర్చు లక్ష కోట్లని.. మరి వీటిలో లక్ష కోట్ల అవినీతి ఎలా జరుగుతుందని కవిత ప్రశ్నించారు. ధరణి పోర్టల్‌ను బంగాళాఖాతంలో కలిపేయాలని అంటున్నారని.. ఆ పని చేస్తే భూమిపై హక్కు ఎవరిది అనేది ఎలా తెలుస్తుందని ఆమె నిలదీశారు. పొరపాటున కాంగ్రెస్ గనుక ఓటేస్తే కేవలం మూడు గంటల పాటే కరెంట్ వస్తుందని ఓటర్లను కల్వకుంట్ల కవిత హెచ్చరించారు. 

ఇకపోతే.. కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు చేపట్టిన బస్సు యాత్రపై కేటీఆర్ విమర్శలు గుప్పించారు. విభజన హామీలపై ఏనాడూ కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వాన్ని ప్రశ్నించని రాహుల్ గాంధీకి తెలంగాణలో పర్యటించే అర్హత లేదని అన్నారు. కాంగ్రెస్ బస్సుయాత్ర.. తుస్సుమనడం ఖాయమని విమర్శించారు. సంక్షేమంలో స్వర్ణయుగానికి కేరాఫ్ తెలంగాణ అని.. చీకటి పాలనకు చిరునామా కర్ణాటక అని ఆరోపించారు. తమ ప్రభుత్వ రిమోట్ తెలంగాణ ప్రజల చేతిలో పదిలంగా ఉందని.. వారి గాంధీభవన్ రిమోటే గాడ్సే చేతిలో మాడి మసైపోతోందని విమర్శలు గుప్పించారు. ఈ మేరకు ఎక్స్ (ట్విట్టర్)లో కేటీఆర్ పోస్టు చేశారు. 

గత పదేళ్ల కాలంలో గిరిజన యూనివర్సిటీపై రాహుల్ ఎందుకు నోరుమెదపలేదని ప్రశ్నించారు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీపై ఒక్కసారైనా ఎందుకు బీజేపీని నిలదీయలేదని అడిగారు. విభజన హామీలపై ఏనాడూ ఎన్డీఏను ప్రశ్నించని రాహుల్ కు తెలంగాణలో పర్యటించే అర్హత లేదని అన్నారు. కర్ణాటకలో ప్రజలకిచ్చిన హామీలన్నీ వందరోజుల్లోనే బొందపెట్టిన పార్టీ కాంగ్రెస్ అని విమర్శించారు. తెలంగాణలో మేనిఫెస్టోలో ఇవ్వని హామీలను కూడా నెరవేర్చిన ప్రభుత్వం తమది అని అన్నారు. 

కర్ణాటకలో రైతులకు ఐదుగంటల కరెంట్ కూడా ఇవ్వలేమని చేతులెత్తేసిన చేతకాని దద్దమ్మలు కాంగ్రెస్ నేతలని.. రైతులకు 24 గంటలు నిరంతర ఉచిత విద్యుత్ అందిస్తూ తెలంగాణలో సాగును సంబురంగా మార్చిన పాలన తమది అని అన్నారు. కర్ణాటకలో నమ్మి ఓటేసిన ప్రజలను నట్టేట ముంచి.. తెలంగాణలో నాటకాలకు తెరదీస్తే నమ్మేదెవరని ప్రశ్నించారు. కాంగ్రెస్ అంటే కరప్షన్‌కు కేరాఫ్ అని ఆరోపించారు. కమిషన్ల కోసం కాంట్రాక్టర్లకు నిత్యం వేధింపులకు గురిచేస్తున్నారని.. అలాంటిది ఇక్కడికొచ్చి నీతి వాక్యాలా ? అని ప్రశ్నించారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios