చంద్రబాబు అరెస్ట్.. ఢిల్లీలో మీ ఇష్టం, హైదరాబాద్‌లో మాత్రం : కవిత సంచలన వ్యాఖ్యలు
ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ వ్యవహారం ఏపీతో పాటు తెలంగాణలోనూ దుమారం రేపుతోంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పందించారు. ఢిల్లీ దేశం మొత్తానికి రాజధాని కాబట్టి అక్కడ ధర్నాలు చేసుకుంటే ఎవరికీ అభ్యంతరం వుండదన్నారు.

ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ వ్యవహారం ఏపీతో పాటు తెలంగాణలోనూ దుమారం రేపుతోంది. ఆయన అరెస్ట్ అయిన క్షణం నుంచి చంద్రబాబు అభిమానులు, టీడీపీ మద్ధతుదారులు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో నిరసన ప్రదర్శనలు చేశారు. ప్రత్యేకించి ఐటీ ఉద్యోగులు రోడ్డెక్కడం చర్చనీయాంశమైంది. దీంతో స్వయంగా మంత్రి కేటీఆర్ స్పందించారు. ఆంధ్రా పంచాయతీలు హైదరాబాద్‌లో పెట్టొద్దని.. చంద్రబాబు అరెస్ట్‌కు తెలంగాణకు సంబంధం ఏంటని ప్రశ్నించారు. తెలంగాణలో ఆందోళనలు చేయడానికి వీల్లేదని కేటీఆర్ తేల్చిచెప్పేశారు. ఈ నేపథ్యంలో ఆయన సోదరి, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కూడా చంద్రబాబు అరెస్ట్‌పై స్పందించారు.
ఢిల్లీ దేశం మొత్తానికి రాజధాని కాబట్టి అక్కడ ధర్నాలు చేసుకుంటే ఎవరికీ అభ్యంతరం వుండదన్నారు. హైదరాబాద్‌లో ధర్నా చేయాలంటే అవి తెలంగాణ అంశాలే అయ్యుంటే బాగుంటుందని కవిత అభిప్రాయపడ్డారు. కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను కొందరు వక్రీకరిస్తున్నారని.. భావోద్వేగాలు రెచ్చగొడుతున్నారని రేవంత్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పరిస్ధితులు ఇలాగే వుంటాయని.. నిత్యం ధర్నాలు, నిరసనలు, కర్ఫ్యూలే వుంటాయని కవిత పేర్కొన్నారు. దేశంలో అనేక మంది రాజకీయ నేతలు వేధింపులకు గురవుతూ వుండటం చూస్తున్నామని.. ఇది పార్టీలు, వారి లీగల్ విభాగం చూసుకోవాల్సిన అంశమని ఆమె స్పష్టం చేశారు. ఇది టీడీపీ, వైసీపీ చూసుకోవాల్సిన అంశమని.. దీనిని పక్క రాష్ట్రంలో చర్చకు పెట్టాలనుకోవడం దారుణమని కవిత ఫైర్ అయ్యారు.
Also Read: ఏపీ రాజకీయాలతో తెలంగాణకు ఏం సంబంధం?: చంద్రబాబు అరెస్టుపై కేటీఆర్
చంద్రబాబు అరెస్ట్‌పై స్పందించారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. బుధవారం రేవంత్ గాంధీ భవన్‌లో మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్ పదేళ్ల పాటు రెండు రాష్ట్రాలకు ఉమ్మడి రాజధాని అని , అలాంటిది ఏపీకి చెందిన అంశంపై ఇక్కడ నిరసన జరపొద్దు అంటూ ఎలా అని ప్రశ్నించారు. చంద్రబాబు అరెస్ట్‌పై నిరసనలు చేస్తున్న ఐటీ ఉద్యోగులపై ఆంక్షలు విధించడం, ఆందోళన చేయొద్దని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు అర్ధరహితమన్నారు.
ఐటీ ఉద్యోగుల నిరసనల్లో తప్పేం వుందని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. బీఆర్ఎస్ పార్టీకి ఏపీ వాళ్ల ఓట్లు కావాలి.. వాళ్లకు కష్టం వస్తే మాత్రం రెండు పార్టీల మధ్య సమస్య అంటున్నారని ఆయన ఫైర్ అయ్యారు. చంద్రబాబు అరెస్ట్ ఏపీ రాజకీయాలకే పరిమితమైంది కాదని.. దేశ రాజకీయాలకు సంబంధించిన అంశమని రేవంత్ పేర్కొన్నారు. చింతమడకకు చెందిన కేటీఆర్‌కు హైదరాబాద్‌లో పనేంటి అని ఆయన ప్రశ్నించారు.