ఉచిత విద్యుత్ పై రేవంత్ ప్రకటనతో రైతు డిక్లరేషన్ బోగస్సే: విద్యుత్ సౌధ వద్ద కవిత ఆందోళన
ఉచిత విద్యుత్ పై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రకటనను నిరసిస్తూ బీఆర్ఎస్ ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు నిర్వహిస్తుంది. విద్యుత్ సౌధ ముందు నిర్వహించిన ఆందోళనలో కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు.
హైదరాబాద్: ఉచిత విద్యుత్ పై రేవంత్ రెడ్డి చేసిన ప్రకటనతో రైతు డిక్లరేషన్ పై కాంగ్రెస్ ప్రకటన బోగస్ అని తేట తెల్లమైందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు.ఉచిత విద్యుత్ పై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను నిరసిస్తూ బుధవారంనాడు విద్యుత్ సౌధ ముందు బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన నిర్వహించారు. ఈ ఆందోళనలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు
ఉచిత విద్యుత్ రైతులకు అవసరమా అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారన్నారు. వ్యాపారులకు 24 గంటలు ఉచిత విద్యుత్ ఇవ్వాలా అని ఆమె రేవంత్ రెడ్డిని అడిగారు. రైతులకు ఉచిత విద్యుత్ అవసరం లేదన్న వ్యాఖ్యలు చేసినందుకు క్షమాపణలు చెప్పాలని ఆమె రేవంత్ రెడ్డిని డిమాండ్ చేశారు. రూ. లక్ష కోట్ల పెట్టుబడి పెట్టి విద్యుత్ వ్యవస్థను బాగు చేస్తున్నామని కవిత తెలిపారు. కాంగ్రెస్, టీడీపీలు రైతులకు ఏం న్యాయం చేయలేదన్నారు. ఈ రెండు పార్టీల్లో రేవంత్ రెడ్డి పనిచేశారన్నారు. బీఆర్ఎస్ పాలనలో విద్యుత్ విషయంలో మిగులు రాష్ట్రంగా మారిందని కవిత ప్రస్తావించారు. రైతులకు మూడు గంటల విద్యుత్ సరిపోతుందని ప్రకటించిన రేవంత్ రెడ్డిని తరిమికొట్టాలని కవిత రైతులను కోరారు.
also read:తెలంగాణ రైతులపై కక్ష ఎందుకు: ఉచిత విద్యుత్ పై రాహుల్ ను ప్రశ్నించిన కవిత
60 ఏళ్లు పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకొని అభివృద్ధి వైపు సాగుతున్నామన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రైతులకు ఇబ్బందులు తొలగాయన్నారు. రైతు బంధు, ఉచిత విద్యుత్ వంటి పథకాలతో రైతులకు ఇబ్బందులు తొలగిపోయాయని ఎమ్మెల్సీ కవిత చెప్పారు. రైతు సంక్షేమం కోసం తెలంగాణ తీసుకు వచ్చిన పథకాలు దేశంలోనే అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచాయని ఆమె గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న విధానాల కారణంగా వరి ఉత్పత్తిలో 15వ స్థానం నుండి రాష్ట్రం మొదటిస్థానానికి చేరుకుందని కవిత చెప్పారు.
తెలంగాణ సీఎం కేసీఆర్ రైతు బంధు ప్రవేశ పెట్టిన తర్వాత పలు రాష్ట్రాల్లో ఇదే తరహాలో పథకాలను ప్రవేశపెట్టిన విషయాన్ని ఆమెతెలిపారు. నాణ్యమైన విద్యుత్ సరఫరా లేకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. మిషన్ కాకతీయ, కాళేశ్వరం ప్రాజెక్టుల ద్వారా భూగర్భజలాల పెంపు కోసం తమ ప్రభుత్వం కృషి చేసిందని కవిత వివరించారు.