Delhi Liquor Scam: న్యాయ నిపుణులతో కవిత చర్చలు ,ఈడీకి సమాచారం పంపిన ఎమ్మెల్సీ
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత న్యాయ నిపుణులతో చర్చిస్తున్నారు. ఆలస్యంగా ఈడీ విచారణకు కవిత హాజరయ్యే అవకాశం ఉందని సమాచారం
న్యూఢిల్లీ: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గురువారంనాడు న్యూఢిల్లీలోని కేుసీఆర్ నివాసంలో న్యాయ నిపుణులతో చర్చిస్తున్నారు. ఇవాళ ఉదయం 11 గంటలకు కవిత ఈడీ విచారణకు హాజరు కావాల్సి ఉంది. కానీ 11 గంటలు దాటినా కూడా ఆమె తన నివాసంలోనే ఉన్నారు. న్యాయ నిపుణులతో కవిత చర్చిస్తున్నారు.ఈ సమావేశం తర్వాత తన ప్రతినిధి ద్వారా ఈడీ కార్యాలయానికి కవిత సమాచారం పంపారని తెలుస్తుంది.ఈడీ అడిగిన సమాచారాన్ని కవిత తన ప్రతినిధి ద్వారా ఈడీకి పంపినట్టుగా తెలుస్తుంది. అయితే ఈ విషయమై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి సోమా భరత్ ద్వారా కవిత ఈడీకి సమాచారం పంపారు.
ఢిల్లీ లిక్కర్ స్కాంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఇవాళ రెండో సారి ఈడీ విచారణకు హాజరు కావాల్సి ఉంది. ఈ నెల 11న కవిత ఈడీ విచారణకు హాజరైన విషయం తెలిసిందే. ఇవాళ ఉదయం 10 గంటలకు మీడియాతో మాట్లాడి ఈడీ విచారణకు వెళ్లనున్నట్టుగా కవిత కార్యాలయ వర్గాలు మీడియాకు సమాచారం ఇచ్చారు. అయితే విచారణకు హాజరు కావడానికి ముందే కవిత న్యాయ నిపుణులతో చర్చిస్తున్నారు. పలువురు మంత్రులు ఇప్పటికే న్యూఢిల్లీకి చేరుకున్నారు.