ఢిల్లీ లిక్కర్ స్కాంతో కవితకు సంబంధం లేదు: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ భాను ప్రసాద్
ఢిల్లీ లిక్కర్ స్కాంతో ఎమ్మెల్సీ కవితకు ఎలాంటి సంబంధం లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ భాను ప్రసాద్ చెప్పారు.
హైదరాబాద్: ఢిల్లీ లిక్కర్ స్కాం తో ఎమ్మెల్సీ కవిత కు ఎలాంటి సంబంధం లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ టి. భాను ప్రసాద్ చెప్పారు.ఈడీ దాఖలు చేసిన చార్జీషీట్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పేరున్న విషయం తెలిసిందే.గురువారం నాడు బీఆర్ఎస్ శాసనససభపక్ష కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈడీ దాఖలు చేసిన చార్జీషీట్ పై చట్ట ప్రకారంగా ఏం చేయాలో అది చేస్తామన్నారు. రాజకీయంగా ఇబ్బందికి గురి చేసేందుకే కవిత పేరును చార్జీషీట్ లో పెట్టారని ఆయన విమర్శించారు.
రాష్ట్ర కొత్త సచివాలయానికి బీ ఆర్ అంబేద్కర్ పేరు పెట్టడమే ఆ మహానేత కు ఘనమైన నివాళి అని ఆయన పేర్కొన్నారు. సచివాలయం ఏ తేదీన ప్రారంభిస్తామనేది ప్రధానం కాదన్నారు. గ్రామ పంచాయతీలకు కేంద్రం ఇస్తున్న నిధులు దారి మళ్లించే అవకాశమే లేదని ఆయన చెప్పారు.
పంచాయతీలకు గతం లో కన్నా రాష్ట్ర ప్రభుత్వం ఎక్కువ నిధులు కేటాయిస్తోందని ఎమ్మెల్సీ భాను ప్రసాద్ చెప్పారు.
బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ను నిరాశ నిస్పృహ ,అసూయ, అసహనం ఆవరించాయన్నారు.
తెలంగాణ కోసం పార్టీ పెట్టి రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తి కేసీఆర్ అని ఎమ్మెల్సీ భాను ప్రసాద్ చెప్పారు. అలాంటి కేసీఆర్ తల్లిపాలు రొమ్ముగుద్దారని ఈటల రాజేందర్ విమర్శించడాన్ని ఆయన తప్పుబట్టారు. ఆర్థిక మంత్రిగా ఈటల రాజేందర్ ఉన్న సమయంలో అప్పులు చేయలేదా అని ఆయన ప్రశ్నించారు..తెలంగాణ లో చేసిన అప్పులు ఉత్పాదక రంగం కోసమేనని ఆయన వివరించారు.
తెలంగాణ చేసిన అప్పులకు లెక్క ఉందన్నారు. కానీ, కేంద్రం అప్పులు తెచ్చి ఏమి చేసిందని ఆయన ప్రశ్నించారు. క్యాపిటల్ వ్యయం రాష్ట్రంలో ఎక్కువగా ఉందన్నారు. . అది ఈటెల కు తెలియదా అని అడిగారు.తెలంగాణ కు మొండి చేయి చూపిన కేంద్ర బడ్జెట్ ను ఈటెల ఏ మొహం పెట్టుకొని సమర్ధించుకుంటారని ఆయన ప్రశ్నించారు.
పీఎం కిసాన్ పథకానికి నిధులు తగ్గించడం, విభజన చట్టం హామీల అమలు ను ప్రస్తావించకపోవడం, రాష్ట్రానికి ఒక్క నర్సింగ్ కాలేజీ ఇవ్వకపోవడంతో కేంద్ర బడ్జెట్ నచ్చిందా అని ఈటల రాజేందర్ ను ఆయన అడిగారు. మోడీ పీఎం అయ్యాక వంద లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసింది నిజం కాదా అని ప్రశ్నించారు. రాష్ట్రం లో అప్పులు తెచ్చి ఉత్పాదక రంగాల మీద ఖర్చు పెడితే కేంద్రం అప్పులు తెచ్చి బీజేపీ కార్పోరేట్ మిత్రులకు దోచి పెడుతుందని ఆయన విమర్శించారు.