జైలు నుండి చంద్రబాబు విడుదల... హర్షం వ్యక్తంచేసిన బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుకు బెయిల్ రావడం... జైలునుండి విడుదల కావడంపై బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు హర్షం వ్యక్తం చేసారు.

హైదరాబాద్ : ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జైలు నుండి విడుదల కావడంతో తెలుగుదేశం శ్రేణులు సంబరాల్లో మునిగిపోయారు. కేవలం టిడిపి నాయకులు, కార్యకర్తలే కాదు చంద్రబాబు జైలునుండి బయటకురావడంపై బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు కొందరు హర్షం వ్యక్తం చేసారు. తెలంగాణ ప్రభుత్వ విప్, హైదరాబాద్ పరిధిలోని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికేపూడి గాంధీ, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ కూడా చంద్రబాబు విడుదలపై స్పందింస్తూ ఆనందం వ్యక్తం చేసారు.
చంద్రబాబు హైకోర్టు బెయిల్ మంజూరు చేయడం మంచి పరిణామంగా బిఆర్ఎస్ ఎమ్మెల్యే గాంధీ పేర్కొన్నారు. నంద్యాలలో అరెస్ట్ నుండి ఇప్పటివరకు చంద్రబాబు కోసం పోరాడిన ప్రతి ఒక్కరికి ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు. చంద్రబాబుపై పెట్టినవన్నీ తప్పుడు కేసులేనని... ఇవి నిలబడవని అన్నారు. ఇప్పుడు బెయిల్ పై బయటకు వచ్చినట్లే త్వరలోనే కేసులన్నింటి నుండి కూడా చంద్రబాబు బయటపడతానని... న్యాయవ్యవస్థపై ఆ నమ్మకం వుందన్నారు. కడిగిన ముత్యంలా చంద్రబాబు మారతారని బిఆర్ఎస్ ఎమ్మెల్యే గాంధీ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.
ఇక మరో బిఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ కూడా చంద్రబాబు విడుదలపై స్పందించారు. 53రోజులు జైల్లో వున్న చంద్రబాబుకు కోర్టు బెయిల్ ఇవ్వడం... వెంటనే ఆయన విడుదల కావడం ఆనందదాయకమని అన్నారు. ఆయన సంపూర్ణ ఆరోగ్యవంతులు కావాలని కోరుకుంటున్నట్లు ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ పేర్కొన్నారు.
Read More నేడు హైదరాబాద్ కు చంద్రబాబు.. వైద్యపరీక్షలు ఇక్కడే...
ఇదిలావుంటే రాజమండ్రి జైలునుండి విడుదలైన చంద్రబాబుకు టిడిపి శ్రేణులు నీరాజనం పడుతున్నారు. రాజమండ్రి నుండి ఉండవల్లి నివాసానికి చేరుకోడానికి చంద్రబాబుకు 14 గంటల సమయం పట్టిందంటేనే ఆయనకు ఎలా బ్రహ్మరథం పడుతున్నారో అర్థమవుతుంది.
అమరావతి మహిళలు ఉండవల్లిలోని ఆయన నివాసం వద్ద గుమ్మడికాయల దిష్టితీస్తూ అధినేతకు నీరాజనాలు పట్టారు. దారిపొడవునా 45ఏళ్ల రాజకీయ జీవితంలో కనీవినీ ఎరుగని రీతి చంద్రబాబునాయుడుకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. సుధీర్ఘ ప్రయాణం తర్వాత ఇంటికి చేరుకున్న చంద్రబాబుకు భార్య భువనేశ్వరి కొబ్బరికాయతో దిష్టి తీసారు. అలాగే పండితులు ఆయనకు హారతి ఇచ్చి, గుమ్మడి కాయతో దిష్టితీసి ఇంట్లోకి తీసుకెళ్లారు.
చంద్రబాబు రాజమండ్రి నుండి ఉండవల్లికి రోడ్డుమార్గంలో వెళ్లగా ఆ దారంతా జనసంద్రంగా మారింది. టిడిపి జెండాలతో పాటు జాతీయ జెండాలు కూడా చేతబట్టి టిడిపి సపోర్టర్స్ రోడ్లపైకి వచ్చారు. సామాన్య ప్రజలు కూడా చంద్రబాబును చూసేందుకు అర్థరాత్రి అయినా రోడ్లపైనే ఎదురుచూసారు. ఇలా అమరావతి ప్రాంతానికి చేరుకున్న చంద్రబాబుకు రాజధాని మహిళలు నీరాజనం పట్టారు.