ఎమ్మెల్యేల ప్రలోభాల కేసు సీబీఐ విచారణకు తెలంగాణ హైకోర్టు ఒకే: అప్పీల్ కు వెళ్లే యోచనలో సిట్
ఎమ్మెల్యేల ప్రలోభాల కేసును సీబీఐకి అప్పగిస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై అప్పీల్ కు వెళ్లనుంది సిట్. ఈ తీర్పునకు సంబంధించి కాపీ రాగానే సిట్ అధికారులు న్యాయ నిపుణులతో చర్చించనున్నారు.
హైదరాబాద్: ఎమ్మెల్యేల ప్రలోభాల కేసును సీబీఐకి అప్పగిస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సిట్ అప్పీల్ కు వెళ్లే అవకాశం ఉంది. ఈ ఏడాది అక్టోబర్ 26న నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురి చేస్తూ పోలీసులకు ముగ్గురు పట్టుబడ్డారు. అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు, కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి , తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డిలను ప్రలోభాలకు గురి చేశారని పోలీసులకు ఫిర్యాదు అందింది. ఈ విషయమై తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఫిర్యాదు మేరకు మొయినాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో రామచంద్రభారతి, సింహయాజీ, నందకుమార్ లను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరికి హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది.
ఈ కేసు విచారణకు గాను హైద్రాబాద్ సీపీ సీవీ ఆనంద్ నేతృత్వంలో సిట్ ను ఏర్పాటు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే సిట్ తో కాకుండా సీబీఐ లేదా స్వతంత్ర దర్యాప్తు సంస్థతో విచారణ కోరుతూ బీజేపీ పిటిషన్ దాఖలు చేసింది. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి తో పాటు మరో నలుగురు ఇదే డిమాండ్ తో పిటిషన్లను దాఖలు చేశారు. అయితే టెక్నికల్ అంశాలను ప్రాతిపదికగా తీసుకున్న తెలంగాణ హైకోర్టు బీజేపీ సహా మరొకరి పిటిషన్ ను కొట్టివేసింది. ఈ కేసును సీబీఐ విచారణ కోరుతూ మరో ముగ్గురు దాఖలు చేసిన పిటిషన్లను సీబీఐ పరిగణనలోకి తీసుకుంది.అంతేకాదు సిట్ దర్యాప్తును నిలిపివేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ పరిణామాలు తెలంగాణ ప్రభుత్వానికి షాక్ ను కలిగించాయి.
ఈ కేసును సీబీఐకి అప్పగిస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై హైకోర్టు డివిజన్ బెంచ్ లో సిట్ అప్పీల్ కు వెళ్లే అవకాశం ఉంది. ఈ విషయమై తెలంగాణ హైకోర్టు తీర్పునకు సంబంధించిన పూర్తి కాపీని అందిన తర్వాత ఈ విషయమై న్యాయ నిపుణులతో సిట్ చర్చించనుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ప్రలోభాల కేసు అంశం దేశ వ్యాప్తంగా చర్చకు దారి తీసింది. ఈ కేసుకు సంబంధించి ఎమ్మెల్యేలతో నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ముగ్గురు మాట్లాడిన ఆడియో, వీడియో సంభాషణలు బయటకు వచ్చాయి. తెలంగాణ సీఎం కేసీఆర్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి వీడియో, ఆడియో సంభాషణలల గురించి వివరించిన విషయం తెలిసిందే.
also read:బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ప్రలోభాల కేసు: సీబీఐ విచారణకు తెలంగాణ హైకోర్టు అనుమతి
ఈ కేసును సిట్ విచారిస్తున్న సమయంలో ఆడియో, వీడియో సంభాషణల ఆడియో, వీడియో పుటేజీలతో సీఎం కేసీఆర్ మీడియా సమావేశం ఏర్పాటు చేయడాన్ని కూడా పిటిషనర్ల తరపు న్యాయవాదులు ఈ సందర్భంగా ప్రస్తావించారు. సీఎం కనుసన్నల్లోనే సిట్ విచారణ జరుగుతుందని వాదించారు. ఈ వాదనలను సిట్ తరపు న్యాయవాదులు తోసిపుచ్చారు. ఈ కేసులో అందరి వాదనలను ఈ నెల 16వ తేదీ వరకు వింది. ఇవాళ తీర్పును వెలువరించింది.