Asianet News TeluguAsianet News Telugu

బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ప్రలోభాల కేసు: సీబీఐ విచారణకు తెలంగాణ హైకోర్టు అనుమతి

ఎమ్మెల్యేల ప్రలోభాల కేసును సీబీఐతో  విచారణ చేసేందుకు  తెలంగాణ హైకోర్టు ఇవాళ  అనుమతిని ఇచ్చింది. 

BRS MLAs Poaching Case: Telangana High Court Green Signals to CBI probe
Author
First Published Dec 26, 2022, 4:17 PM IST

హైదరాబాద్: ఎమ్మెల్యేల ప్రలోభాల కేసును సీబీఐతో  విచారణ చేసేందుకు  తెలంగాణ హైకోర్టు సోమవారం నాడు అనుమతి ఇచ్చింది.  ఈ ఏడాది  అక్టోబర్  26వ తేదీన  మొయినాబాద్ ఫాం హౌస్ లో  బీఆర్ఎస్ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురి చేశారని  ముగ్గురిని  పోలీసులు అరెస్ట్  చేశారు. ఈ విషయమై మొయినాబాద్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది.  తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి  ఫిర్యాదు  మేరకు  రామచంద్రభారతి, సింహయాజీ,  నందకుమార్ లను  పోలీసులు అరెస్ట్  చేశారు. నిందితులకు  ఇటీవలనే తెలంగాణ హైకోర్టు  బెయిల్  మంజూరు చేసిన విషయం తెలిసిందే.

ఈ కేసును విచారించేందుకుగాను  తెలంగాణ ప్రభుత్వం హైద్రాబాద్ సీపీ  సీవీ ఆనంద్ అధ్యక్షతన  సిట్ ను ఏర్పాటు  చేసింది.  అయితే  సిట్  విచారణ సీఎం కేసీఆర్ కనుసన్నల్లో సాగుతుందని  బీజేపీ  ఆరోపించింది. ఈ కేసును  సీబీఐ లేదా  స్వతంత్ర దర్యాప్తు  సంస్థతో  దర్యాప్తు చేయించాలని బీజేపీ  పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ తో పాటు  ముగ్గురు నిందితులు  మరొకరు  ఇదే డిమాండ్ తో  తెలంగాణ హైకోర్టులో  పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్లపై  తెలంగాణ హైకోర్టు  సుదీర్థంగా  వాదనలు వింది. 

ఈ పిటిషన్లపై  బీజేపీ తరపున  మహేష్ జెఠ్మలానీ  వాదించారు. ప్రభుత్వం తరపున ధవే వాదించారు. ఈ నెల  16వ తేదీన తుది వాదనలను  హైకోర్టు వింది.  అయితే తీర్పును రిజర్వ్ చేసింది.  ఈ విషయమై  తెలంగాణ హైకోర్టు  ఇవాళ  తీర్పును వెల్లడించింది.  సిట్  విచారణ  నిష్పక్షపాతంగా  జరగడం లేదని  పిటిషనర్లు వాదించారు.  ఈ కేసు విచారణ విషయమై  సీఎం కేసీఆర్ మీడియా సమావేశాన్ని కూడా  పిటిషనర్లు విన్పించారు.  సిట్  విచారణ సరిగా జరగడం లేదని  పిటిషన్లు వాదించారు. పిటిషనర్ల  వాదనతో  తెలంగాణ హైకోర్టు ఏకీభవించింది.   

also read:ఎమ్మెల్యేల ప్రలోభాల కేసు సీబీఐతో విచారణ: తీర్పును రిజర్వ్ చేసిన తెలంగాణ హైకోర్టు

సిట్ దర్యాప్తును నిలిపివేయాలని  తెలంగాణ హైకోర్టు  ఆదేశాలు జారీ చేసింది.   ఈ కేసును సీబీఐతో విచారణ జరిపించాలని  దాఖలు చేసిన ఐదు పిటిషన్లలో  రెండు పిటిషన్లను  తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. మిగిలిన మూడు పిటిషన్లను  అనుమతించింది.  బీజేపీ సహా మరొకరి  పిటిషన్ ను  తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది.  బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ప్రలోభాల కేసును  సీబీఐకి అప్పగిస్తూ  తెలంగాణ  హైకోర్టు  ఇచ్చిన  ఆదేశాలపై సిట్   అప్పీల్ కు వెళ్లే అవకాశం ఉంది.ఈ కేసును సీబీఐతో  విచారణ జరిపించాలని  బీజేపీ నేతలు  డిమాండ్  చేస్తున్నారు. ఈ కేసులో  ఇప్పటివరకు సిట్  సేకరించిన  ఆధారాలను  సీబీఐ అధికారులు  తీసుకోనున్నారు.  తొలుత సీబీఐ అధికారులు కేసును రిజిష్టర్  చేసి విచారణ చేయనున్నారు.

ఈ కేసుకు సంబంధించి  సిట్  పలువురికి  నోటీసులు  జారీ చేసింది.  బీజేపీ అగ్రనేత బీఎల్ సంతోష్ కు కూడా సిట్  నోటీసులు జారీ చేసింది.  ఈ నోటీసులపై  బీఎల్ సంతోష్  సహా  తుషార్, జగ్గుస్వామిలు  హైకోర్టులో  సవాల్  చేశారు. ఈ నోటీసులపై  తెలంగాణ హైకోర్టు స్టే విధించిన విషయం తెలిసిందే. 

 


 

Follow Us:
Download App:
  • android
  • ios