BRS MLA: ఆ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లోకి వెళ్లుతారా? ఎమ్మెల్యే సునీత లక్ష్మా రెడ్డి రియాక్షన్
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లోకి వెళ్లుతున్నారని, అందుకే నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డిని కలిశారని ప్రచారం జరిగింది. ఈ ప్రచారంపై ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి స్పందించారు.
Revanth Reddy: లోక్ సభ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేసే కుట్రకు తెరలేపుతుందని బీజేపీ చేసిన ఆరోపణలు దుమారాన్ని రేపాయి. ఆ ప్రయత్నాలు జరిగితే తన విశ్వరూపం చూస్తారని సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు కూడా. ఇంతలోనే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి బీఆర్ఎస్‌ను బొందపెడుతామని చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఈ నేపథ్యంలోనే నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. దీంతో కాంగ్రెస్ పార్టీ ముందుగానే ఆపరేషన్ చేపట్టిందా? అనే అనుమానాలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఈ అనుమానాలను పటాపంచలు చేస్తూ వివరణలు ఇస్తున్నారు.
దుబ్బాక ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి, పటాన్‌చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి, జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావులు సీఎం రేవంత్ రెడ్డితో సమావేశం అయ్యారు. ఈ నలుగురూ పార్టీ మార్పు వార్తలను ఖండించారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి ఆ వార్తలను తోసిపుచ్చారు. కొందరు తమకు వ్యతిరేకంగా అవాస్తవ కథనాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తాము సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగానే కలిశామని వివరించారు. ప్రజా సమస్యలపై తాము చర్చించామని తెలిపారు. అభివృద్ధి అంశాలపై సహకరించాలని విజ్ఞప్తి చేశామని చెప్పారు. పార్టీ మారాలనే ఆలోచనలు తమకు లేవని స్పష్టం చేశారు. కేసీఆర్ నాయకత్వంలో పని చేస్తామని వివరించారు.
Also Read : Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.. ఏం జరుగుతోంది..?
తాము పార్టీ మారుతున్నామని తప్పుడు ప్రచారం చేస్తే వారిపై న్యాయపరమైన చర్యలకూ వెనుకాడమని ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి వార్నింగ్ ఇచ్చారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం కోసం తాము పని చేస్తున్నామని వివరించారు.