Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.. ఏం జరుగుతోంది..?
Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మంగళవారం ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. అయితే.. వారి కలయిక తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయంగా మారింది. ఇంతకీ సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయినా నేతలేవరు? ఇంతకీ ఏం చర్చించారు.
Revanth Reddy: ఆంధ్రప్రదేశ్ రాజకీయాలే కాదు.. తెలంగాణ రాజకీయాలు కూడా ఒక్కసారిగా వేడెక్కాయి. పార్లమెంట్ ఎన్నికల ముందు అన్యూహం పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కాంగ్రెస్ నేతల మాటలు.. ప్రతిపక్ష నాయకులు చేష్టాలు అందుకు తగ్గట్టుగా ఉన్నాయి మరీ. ఇంతకీ ఏం జరిగిందని అనుకుంటున్నారా? ఇటీవలే జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపొంది.. రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారనే ప్రచారం జరుగుతోంది.
ఈ నేపథ్యంలో తాజాగా కొందరు ఎమ్మెల్యేలు… ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిగారిని వారి నివాసంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సునీతా లక్ష్మారెడ్డి (నర్సాపూర్), కొత్త ప్రభాకర్ రెడ్డి (దుబ్బాక), గూడెం మహిపాల్ రెడ్డి (పఠాన్ చెరు), మాణిక్ రావు (జహీరాబాద్) మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ కలయికతో రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన ఆ నలుగురు ఎమ్మెల్యేలు బీఆర్ఎస్‌కు స్వస్తి చెబుతారనే ప్రచారం కూడా ప్రారంభమైంది.
ఈ ఊహాగానాలకు తాజాగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేసిన కీలక వ్యాఖ్యలు తోడయ్యాయి. మంగళవారం నాడు నల్గొండ జిల్లా పర్యటనలో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవదనీ, పార్లమెంట్ ఎన్నికల తర్వాత మరో 30 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరుతారని ప్రకటించారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత పార్టీలో మిగిలేది.. కేవలం పదిమంది ఎమ్మెల్యేలే మిగుతారని ప్రకటించడం గమనార్హం.
గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నపుడు కాంగ్రెస్ పార్టీని నిర్వీర్యం చేయడానికి ప్రయత్నాలు జరిగాయి. పెద్ద సంఖ్యలో కాంగ్రెస్, టీడీపీ ఎమ్మెల్యేలను కేసీఆర్ తన పార్టీలోకి లాగేసుకున్నారు. దీంతో కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పోయింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. మరి కాంగ్రెస్ పార్టీ కూడా అదే దారిలో పయనిస్తుందా? కేసీఆర్ పార్టీని కకావికలం చేస్తుందా ? అనేది ఆసక్తికరంగా మారింది. మరికొందరూ ఆపరేషన్ గులాబీ షూరు అయ్యిందని అంటున్నారు. ఎప్పుడు ఎట్టి పరిణామాలు చోటుచేసుకుంటాయో వేచి చూడాలి.