ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన అధికార వైసిపి, ప్రతిపక్ష నాయకులందరూ దద్దమ్మలే అంటూ బిఆర్ఎస్ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసారు. 

హైదరాబాద్ : ఆర్థిక మంత్రి హరీష్ రావు వ్యాఖ్యలతో మరోసారి తెలంగాణ, ఏపీ మధ్య వివాదం రాజుకుంది. ఏపీలో సాగుతున్న పాలన, అక్కడి ప్రజల పరిస్థితిపై హరీష్ చేసిన వ్యాఖ్యలను బిఆర్ఎస్ నాయకులు సమర్దిస్తుంటే వైసిపి నాయకులు మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో బిఆర్ఎస్ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఏపీ రాజకీయ నాయకులను దద్దమ్మలు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు.

హరీష్ రావు చెప్పినదాంట్లో తప్పేమీ లేదని... ఉమ్మడి రాష్ట్రం విడిపోయాక ఏపీ నుండి హైదరాబాద్ కు వలసలు పెరిగాయని సుదర్శన్ రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి కేసిఆర్ పాలన, బిఆర్ఎస్ ప్రభుత్వ పథకాలకు ఆకర్షితులై ఇప్పటివరకు 30 లక్షల మంది తెలంగాణకు తరలివచ్చారని అన్నారు. ఇందుకు తెలంగాణలో పెరిగిన వంట గ్యాస్ కలెక్షన్లే నిదర్శనమన్నారు. దమ్ముంటే ఆ లెక్కలు చూసుకుని సమాధానం చెప్పాలని ఎమ్మెల్యే సవాల్ చేసారు.

ఏపీ పాలకులు విశాఖ ఉక్కు ప్యాక్టరీని ప్రైవేటీకరిస్తే ఆపలేని దద్దమ్మలు అంటూ సుదర్శన్ రెడ్డి మండిపడ్డారు. ఇలాంటి నాయకులపై నమ్మకం లేకే కేంద్రంతో కొట్లాడే దమ్మున్న కేసీఆర్, బిఆర్ఎస్ పార్టీని ఏపీ ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. దీంతో వారికి రాజకీయ భవిష్యత్ వుండదనే ఏపీ నాయకులు పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారని అన్నారు. 

వీడియో

బిజెపి రైతు వ్యతిరేక విధానాలను వైసిపి పాటిస్తోందని... మోటార్లకు మీటర్లు బిగించడమే ఇందుకు నిదర్శనమని బిఆర్ఎస్ ఎమ్మెల్యే అన్నారు. ఏపిలోని డిస్కంలకు పదివేల కోట్ల రుణపరిమితి పెంచినందుకు వైసిపి ప్రభుత్వం మోటార్లకు మీటర్లు బిగించి రైతుల ఉసురు పోసుకుంటోందని అన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ దమ్మున్న నేత కాబట్టే కేంద్ర విధానాలను అమలు చేయమని అని ప్రధాని మోదీ మొఖం మీద కొట్టారన్నారు. కేసిఆర్ ను చూసి నేర్చుకోవాలని ఏపీ పాలకులకు సూచించారు.

పోలవరం ప్రాజెక్ట్ ను పూర్తి చేసుకోలేని చేతగాని పాలకులుగా అధికార వైసిపి, ప్రతిపక్ష పార్టీల నాయకులు మిగిలిపోయారని అన్నారు. ఈ ప్రాజెక్ట్ గురించి చేతగాని ప్రతిపక్ష పార్టీ మాట్లాడదు...అధికారంలో ఉన్న పార్టీ మాట్లాడదని అన్నారు. మోకాళ్ళ మీద కూర్చొని కేంద్రం ఆర్డర్లను ఇంప్లిమెంట్ చేస్తున్న దద్దమ్మలు ఏపీ పాలకులంటూ సుదర్శన్ రెడ్డి మండిపడ్డారు. 

ఏపీలో పాలన, ప్రభుత్వం గురించి మంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యల్లో తప్పేమీ లేదని ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అన్నారు. కెసిఆర్ అమలు చేస్తున్న వ్యవసాయ అనుకూల విధానాలు ఆంధ్రప్రదేశ్ లో ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. ఏపీ పాలకులు ప్రధాని మోదీని ప్రశ్నించలేని దద్దమ్మలని అందరూ అంటున్నారని బిఆర్ఎస్ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి పేర్కొన్నారు.