భారత్ జాగృతి అధ్యక్షురాలు, బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బతుకమ్మ పాటపాడారు. 

హైదరాబాద్ : తెలంగాణ ఆడపడుచులు ఎంతో సంబరంగా జరుపుకునే పండగ బతుకమ్మ. తెలంగాణ ఏర్పాటు తర్వాత ఈ పూలపండగ మరింత అట్టహాసంగా జరుగుతోంది. తీరొక్క పూలతో బతుకమ్మను పేర్చి ఆడపడుచులంతా ఆడిపాడుతూ సందడి చేస్తుంటారు. ఈసారి కూడా బతుకమ్మ పండగను తెలంగాణ ప్రజలు అంగరంగవైభవంగా జరుపుకునేందుకు సన్నాహాలు ప్రారంభించింది కల్వకుంట్ల కవిత సారధ్యంలోని భారత జాగృతి. 

బతుకమ్మ పండగంటేనే ఆటా పాట. తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలను తెలిపే సరికొత్త బతుకమ్మ పాటలను ప్రతిసారీ సేకరిస్తుంటుంది భారత జాగృతి. ఇలా ఈసారి కూడా పాటల సేకరణ ప్రారంభించింది. ప్రజల సహకారంతో ప్రాచీన, మరుగునపడిన బతుకమ్మ పాటలను వెలికితీసి... మధురమైన గొంతు కలిగిన జానపద సింగర్స్ తో పాడించేందుకు సిద్దమయ్యారు. ఇలా ఏదయినా బతుకమ్మ పాట సరికొత్తగా అనిపించినట్లయితే వాట్సాప్ నెంబర్ +91 8985699999 కు పంపించాలని ఎమ్మెల్సీ కవిత విజ్ఞప్తి చేసారు. 

వీడియో

బతుకమ్మ పాటల సేకరణపై చర్చించేందుకు భారత జాగృతి విభాగం జాతీయ కన్వీనర్ కొడారి శ్రీనుతో పాటు ప్రముఖ జానపద గాయకులు తేలు విజయ, పద్మావతి, మౌనిక యాదవ్, సౌమ్య లతో కవిత భేటీ అయ్యారు. ఈ క్రమంలో అందరూ సరదాగా బతుకమ్మ పాటలు పాడారు. స్వయంగా కవిత కూడా పొదల పొదల గట్ల నడుమ నాగమల్లె దారిలో... పొడిసొచ్చే సందమామ నాగమల్లే దారిలో అంటూ పాడారు. ఇలా గాయకులతో పాట కవిత కూడా బతుకమ్మ పాటపాడిన వీడియోను భారత జాగృతి సోషల్ మీడియాలో విడుదల చేసింది. 

Read More 'బిజెపి 100 అబద్దాలు'... సరికొత్త ప్రచారానికి శ్రీకారం చుట్టిన కేటీఆర్ (వీడియో)

ఇక ఇష్టమైన బతుకమ్మ పాటలను భారత జాగృతికి ట్యాగ్ చేయాలని తెలంగాణ ప్రజలకు పిలుపునిచ్చారు. ఇప్పటికే భారత జాగృతి యాప్ లో దాదాపు 150 బతుకమ్మ పాటలు వున్నాయని... ప్రజలు పంపించే పాటల్లో సరికొత్తగా వున్నవాటిని ఇందులో యాడ్ చేస్తామని కవిత తెలిపారు. ఈ బతుకమ్మ పాటల సేకరణలోక్రియాశీలకంగా వ్యవహరిస్తున్న కొడారి శ్రీనును ఎమ్మల్సీ కవిత ప్రత్యేకంగా అభినందించారు.